పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
"పవన్‌ది అడుగడుగునా సామాన్యుడి పక్షం. అణువణువునా సామాజిక స్పృహ. మాటల్లో పదును, చేతల్లో చేవ, మాటకు కట్టుబడే తత్వం. జన సైన్యానికి ధైర్యం. రాజకీయాల్లో విలువలకు పట్టం, అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానులు, కార్యకర్తలు, ప్రజల దీవెనలతో నిండు నూరెళ్లూ వర్థిల్లాలి. మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్ధిలో మీ సహకారం మరువలేనిది" అంటూ ట్వీట్ చేశారు.
దీర్ఘాయుష్మాన్ భవన్.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్
తన తమ్ముడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబరు 2వ తేదీన పవన్ కళ్యాణ తన బర్త్ డే వేడుకలను జరుపుకుంటున్న విషయం తెల్సిందే. దీంతో చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి కూడా తన ఎక్స్ వేదికగా బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
"చనలచిత్ర రంగంలో అగ్రనటుడుగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాషుష్మాన్ భవ పవన్ కళ్యాణ్" అంటూ పేర్కొన్నారు.