చంద్రబాబుపై కక్షసాధింపుతోనే.. జగన్‌కు తెరాస సపోర్టు : పవన్ కళ్యాణ్

మంగళవారం, 15 జనవరి 2019 (10:33 IST)
ఏపీ విపక్ష నేత, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకపుడు తెలంగాణా గడ్డపై అడుగు పెడతానంటే ఒప్పుకోని తెరాస నేతలు ఇపుడు.. అదే జగన్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారనీ చెప్పారు. అంటే గడచిన ఐదేళ్ళలో రాజకీయాలు ఎంత నీచంగా మారిపోయాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. 
 
సంక్రాంతి సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో సంక్రాంతి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా జనసేన ముఖ్యనేతలు, కార్యకర్తలను ఉద్దేశించి పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. గతంలో జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కార్లు మార్చినట్టుగా భార్యలను మార్చుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు పవన్ ఇపుడు సరిగ్గా సమాధానమిచ్చారు. తనపై వ్యక్తిగత విమర్శలతో చేసిన దాడికి ప్రతిగా పదునైన రాజకీ య విమర్శలతో, సమయానుకూలంగా దాడికి దిగారు. 
 
తాజాగా సంక్రాంతి వేడుకల్లో జనసేనాని చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 'రాజకీయాలు ఎంత అసహ్యంగా, నీచంగా మారిపోతాయంటే.. ఒకప్పుడు జగన్మోహన్‌ రెడ్డి తెలంగాణకు వెళతానంటే, అడుగుపెట్టనవివ్వం అన్న తెలంగాణ నేతలు... జగన్మోహన్‌ రెడ్డికి సపోర్టు చేస్తామంటున్నారంటే... ఐదేళ్లలో రాజకీయాలు ఎలా మారిపోతాయో చూడండి అని పవన్ గుర్తు చేశారు. 
 
ముఖ్యంగా, వైఎస్‌, ఈటెల రాజేంద్రను ఉద్దేశించి మాట్లాడుతూ... 'ఏమయ్యా పట్టుమని పదిమంది లేరు.. ఏంటయ్యా మాట్లాడతారు అని కూర్చోబెట్టి, తెలంగాణ ఏం సాధిస్తారు?' అని అన్నారు. వాళ్ల ఇప్పుడు ఆయన కొడుక్కు ఓపెన్‌గా సపోర్టు చేస్తారు. చంద్రబాబుపై కక్షసాధింపు కోసం వాళ్లు అంతా చేస్తుంటే...'  అంటూ గతంలో జరిగిన సంఘటనలకు, వర్తమానంలో జరుగుతున్న వాటికి ముడిపెట్టి పవన్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు జగన్ పార్టీని బాగా ఇరుకున పెట్టాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు