పాలకొండ, అవనిగడ్డ అభ్యర్థులపై పవన్ కసరత్తు

వరుణ్

శుక్రవారం, 29 మార్చి 2024 (09:12 IST)
జనసేన పోటీ చేయనున్న 21 అసెంబ్లీ స్థానాల్లో 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పాలకొండ, అవనిగడ్డ అభ్యర్థులపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కసరత్తు సాగుతోంది. పిఠాపురం పర్యటనకు ముందే వాటి అభ్యర్థులను ప్రకటించాలని భావించారు. కానీ ఆ రెండు స్థానాలకు పోటీపడుతున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రకటన కొంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. పాలకొండకు ఆరుగురు పోటీ పడుతున్నారు. పార్టీలో కొంత మంది నాయకులు ఆ సీటు ఇప్పిస్తామని కొంత మందిని వెంట పెట్టు కుని పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఎవరికి వారు పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 
 
ఇక్కడ వైసీపీ నుంచి విశ్వాసరాయి కళావతి పోటీ చేస్తున్నారు. జనసేన తరపున మహిళనే బరిలోకి దించే ఆలోచనలో జనసేన నాయకత్వం ఉంది. అవనిగడ్డ సీటు కోసం విక్కుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ పోటీ పడుతున్నారు. వీరిలో ఐవీఆర్ఎస్ సర్వేలో విక్కుర్తికే మొగ్గు ఉన్నట్లు తేలింది. ఈ రెండు సీట్లకూ అభ్య ర్థులపై పవన్ వీరాపురం పర్యటన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మచిలీపట్నం లోక్‌సభ సీటు విషయంలో కూడా కొంత గందరగోళం నెలకొంది. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇక్కడి నుంచి పోటీ చేసే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. ఆయన పోటీ నుంచి వైదొలిగితే గ్రీన్‌కో డైరెక్టర్ బండారు నరసింహారావు బరిలో నిలిచే అవకాశముంది. 

బీజేపీ నేత - కాంగ్రెస్ మహిళా నేతకు ఈసీ నోటీసులు 
 
భారతీయ జనతా పార్టీ నేత దిలీప్ ఘోష్, కాంగ్రెస్ మహిళా నేత, ఆ పార్టీ ప్రతినిధి సుప్రియ శ్రీనతేకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. వీరిద్దరూ తమతమ ప్రత్యర్థులపై చేసిన వ్యాఖ్యలు అమర్యాదరకరమైనవని తమ ప్రాథమిక పరిశీలనలో తేలినట్టు ఈసీ పేర్కొంటూ నోటీసులు జారీచేసింది. పైగా, వారిద్దరిపై చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలని కోరింది. ఈ నోటీసులపై మార్చి 29 సాయంత్రం 5 గంటల లోపు స్పందించాలని ఆదేశించింది. నోటీసులకు స్పందించని పక్షంలో వారు చెప్పేందుకు ఏమీ లేదని భావించి చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు ఇరు నేతలకు విడివిడిగా నోటీసులు జారీ చేసింది.
 
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ అమర్యాదకర వ్యాఖ్యలు చేసినందుకు ఆ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకమని, అవమానకరమని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు మీడియాలో కూడా విస్తృతంగా ప్రసారమయ్యాయని చెప్పుకొచ్చింది. మమతా బెనర్జీ కుటుంబనేపథ్యాన్ని అవమానిస్తూ దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొంది.
 
మరోవైపు, బీజేపీ తరపున బరిలోకి దిగిన సినీ నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనతే చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి. ఆమె సోషల్ మీడియా పేజీలో కంగన ఫొటోతో పాటు క్యాప్షన్ 'మార్కెట్లో ప్రస్తుతం రేటు ఎంత' అన్న క్యాప్షన్ కనిపించడం తీవ్ర దుమారానికి కారణమయ్యాయి.
 
అయితే, దిలీప్, శ్రీనతే ఇద్దరూ తమ వివరణ ఇచ్చారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న మమతపై రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే చేశానని, తనకు ఆమెతో ఎటువంటి వ్యక్తిగత వైరం, ద్వేషం లేవని దిలీప్ ఘోష్ అన్నారు. మరోవైపు, తన పేజీకి అనేక మందికి యాక్సెస్ ఉన్నందున వారిలో ఎవరో ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని శ్రీనతే వివరణ ఇచ్చారు. అయితే, వీటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోని ఈసీ వారికి ఈ నోటీసులు జారీచేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు