బీజేపీతో టీడీపీ రాజీ పడింది.. జేడీ లక్ష్మీ నారాయణ వస్తే ఆహ్వానిస్తాం: పవన్

సోమవారం, 26 మార్చి 2018 (18:32 IST)
తెలుగుదేశం పార్టీకి జనసేనాని పవన్ కల్యాణ్ కాస్త దూరమైనట్లే కనిపిస్తోంది. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో టీడీపీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్‌పై అవినీతి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్.. సోమవారం లెఫ్ట్ పార్టీలతో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. టీడీపీని టార్గెట్ చేశారు. పనిలో పనిగా బీజేపీ, వైకాపాలను కూడా ఏకిపారేశారు. 
 
ప్రత్యేక హోదా అక్కర్లేదని అప్పుడు టీడీపీ చెప్పిన విషయాన్ని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతీసారీ బీజేపీతో-టీడీపీ రాజీ పడిందన్నారు. మరోవైపు ప్రత్యేక హోదా కోసం వైసీపీ కూడా బలమైన పోరాటం చేయలేదని పవన్ విమర్శలు గుప్పించారు. 
 
నిధులను ఏపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఖర్చుపెట్టిందని అమరావతి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజధానిలా ఉందని పవన్ విమర్శించారు. అభివృద్ధి, ప్రజారోగ్యం కోసం ఖర్చుపెట్టాల్సిన డబ్బులు పుష్కరాల కోసం ఖర్చుపెట్టారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని పవన్ అన్నారు.

ఇక మా పార్టీలోకి‌ సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ వస్తారని‌ ప్రచారం జరుగుతోంది. గతం‌లో ఒక్కసారి మాత్రమే ఆయన్ని కలిశాను.. మొన్నటికి మొన్న ఆవిర్భావ సభకు ముందు కూడా ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ తనకు జేడీ మెసేజ్ పెట్టారు. అంతేకానీ, ఆయన మా పార్టీలోకి వస్తానంటే తప్పకుండా ఆహ్వానిస్తానని పవన్‌ తెలిపారు. 
 
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాపై రాసిన లేఖను పట్టించుకోవాల్సిన అవసరం జనసేనకు లేదన్నారు. అమిత్ షా ఓ పార్టీ ప్రెసిడెంట్‌ మాత్రమే. ఆయన భారత దేశ ప్రభుత్వ ప్రతినిధి కాదు. ఓ పార్టీ ప్రతినిధి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి గురించి ఎలా మాట్లాడగలరు? అంటూ పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు.
 
రాష్ట్ర విభజన చట్టంలో వున్న అంశాలు అమలుకావట్లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. గిరిజన, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రారంభించాలంటే చట్టసవరణ చేయాలని, నాలుగేళ్లయినా ఎందుకు చట్టసవరణ చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో వాస్తవాలు ఏమిటో తెదేపా ప్రభుత్వం ప్రజలకు చెప్పలేదని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరించాయని మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు