ఈ గ్రామం ఊరా? శ్మశానమా? పేదోడి ప్రాణం కాపాడలేని నేత ఉంటే ఎంతా? పోతే ఎంత?: పవన్ (వీడియో)

మంగళవారం, 3 జనవరి 2017 (12:10 IST)
ఒక గ్రామంలో పది మంది చనిపోయారు. ఈ గ్రామం.. ఊరా? శ్మశానమా?.. నేతల్లారా వినపడుతుందా.. కనిపిస్తుందా? పేదవాడి ప్రాణం కాపాడలేని నాయకుడు ఉంటే ఎంత పోతే ఎంత? కిడ్నీ బాధితులను ఎందుకు పట్టించుకోలేదో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలంటే ఓటు బ్యాంకు కాదు. ఉద్దానంలోని కిడ్నీ బాధితులపై నివేదిక వచ్చిన తర్వాత నేనే ప్రజల తరపున పోరాడుతాను. పుష్కరాలకు రూ.100 కోట్లు ఖర్చు చేశారు. ఇక్కడ ప్రజలు ప్రాణాలు పోతుంటే పట్టించుకోరా? ఇది కేవలం మంచినీటి సమస్యే కాదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, ఉద్దానంలలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న బాధితులను పవన్ కళ్యాణ్ మంగళవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 48 గంటల డెడ్‌లైన్ విధిస్తున్నా. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కిడ్నీ వ్యాధి పీడితులకు 48 గంటల్లోగా తక్షణసాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా వేలాదిమంది కిడ్నీ సమస్యలతో చనిపోతున్నా ప్రజాప్రతినిధులు ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోయారని పవన్ నిలదీశారు.
 
కేంద్ర, రాష్ట్రాలు నిధులు లేవనే కబుర్లు ఇక చెప్పవద్దని డీమోనిటైజేషన్ నేపథ్యంలో బ్యాంకుల దగ్గర లక్షల కోట్లు మూలుగుతున్నాయని చెప్పారు. రూ.100 కోట్లు కేటాయించి ఈ సమస్యకు పరిష్కారమార్గం చూపాలన్నారు. లేదంటే, మీరు చాలా ఘోరం చేసినవాళ్లవుతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. పుష్కరాలకు, కొత్త రాజధాని నిర్మాణానికి రూ.వేల కోట్లు ఖర్చుచేస్తున్నారని.. వాటికంటే, ఇది అత్యంత ప్రాధాన్యమున్న సమస్య అని పవన్ కళ్యాణ్ అన్నారు.
 
ఉద్దానం, ఇచ్చాపురంలో కిడ్నీ వ్యాధి పూర్వాపరాలపై సమగ్రనివేదిక ఇచ్చేందుకు జనసేన పార్టీ తరపున డాక్టర్ హరిప్రసాద్‌తో కూడిన ఐదుగురు సభ్యులతో కమిటీని వేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీ 15 రోజుల్లో ఒక నివేదిక తయారు చేసి దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసి, బాధితులను ఆదుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తగిన రీతిలో స్పందించకపోతే, దీనికి ఉద్యమరూపాన్ని ఇస్తానని పవన్ హెచ్చరించారు. 

 

వెబ్దునియా పై చదవండి