గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు.. బీజేపీపై కోపమే.. జల్లికట్టు ఉద్యమం: పవన్ కల్యాణ్

శుక్రవారం, 27 జనవరి 2017 (09:42 IST)
ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై జనసేనాని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, తనకు రాజకీయ నాయకుల్లో అవకాశవాద రాజకీయాలే కనిపిస్తున్నాయని నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ కూటమికి తాను ఎందుకు మద్దతిచ్చానన్న కారణాన్ని పవన్ కల్యాణ్ వివరించారు.

కొన్ని దశాబ్దాలుగా మూలుగుతున్న సమస్యలను పరిష్కరించకుండా, ఆలస్యం చేయడం ద్వారా గోటి పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకువచ్చారన్నారు. సమస్యలను పెంచడం వల్ల, అందుకు తనకు వచ్చిన కోపం, ఆవేదనతోనే జనసేన పార్టీని పెట్టినట్టు పవన్ కల్యాణ్ చెప్పారు. 
 
బీజేపీ కేంద్రంలో, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయిందని, ఈ మూడేళ్ల కాలంలో తాను ప్రభుత్వాలను ఎన్నడూ ఇబ్బందులు పెట్టలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. అన్నీ రూల్ బుక్ ప్రకారం జరగాలంటే కుదరదన్న సంగతి తనకు తెలుసునని, అందుకే తగినంత సమయం ఇవ్వాలని భావించినట్టు తెలిపారు. 
 
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి, ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీ ఉన్నారు. ఆయన సమస్యలను అర్థం చేసుకుంటారు. అలాగే పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. జరిగిన అనుభవాల నుంచి వారు పాఠాలు నేర్చుకోని ఉంటారని అనుకున్నాను. అందుకే బీజేపీకి టీడీపీ మద్దతిచ్చాను. వారి జెండాను మోశాను. తనతో పాటు తనను నమ్మినవారందరూ ఆ పార్టీల జెండాలు మోశారు. కానీ వాళ్లు ఏదైతే మాటిచ్చారో, దాన్ని తప్పారని పవన్ నిప్పులు చెరిగారు. 
 
తనకు రాజకీయ నాయకుల్లో అవకాశవాద రాజకీయాలే కనిపిస్తున్నాయని నిప్పులు చెరిగారు. పదవిలోకి రాకముందు ఆకాశాన్ని తెస్తాం, చంద్రడిని భూమ్మీదకు తెస్తాం అని ఆశలు కల్పించి, పదవుల్లోకి, అధికారంలోకి వచ్చాక వాటిని మరచిపోయి, కుంటిసాకులు చెప్పి వాటిని మరచిపోవడం తనకు నచ్చలేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ పరిస్థితి తనతో పాటు అనేక లక్షల మందికి ఆవేదన, బాధ కలిగించిందని పవన్ తెలిపారు. భిన్న సంస్కృతులు, భిన్న కులాలు... వీటిని అర్ధం చేసుకోకుండా, వీటిని గౌరవించకుండా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వాన్ని నడపలేదని హెచ్చరించారు. 
 
బీజేపీకి తాను మద్దతిస్తున్న వేళ, తనకు రాజకీయ అనుభవం ఉందా? అన్న ప్రశ్న తలెత్తలేదని, ఆనాడు ఈ ప్రశ్నను సిద్ధార్థ నాథ్ సింగ్ అడగలేదని పవన్ చెప్పారు. ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు తనను తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు తిప్పారని, బతిమిలాడి తెలంగాణ అంతటా పర్యటనలకు పంపారని పవన్ గుర్తు చేశారు.

ఆనాడు ప్రచారానికి అవసరం లేని రాజకీయ అనుభవం నేడెందుకని పవన్ ప్రశ్నలు సంధించారు. కానీ ఈ రోజు ప్రత్యేక హోదాను గురించి అడిగితే, తనకు రాజకీయాలపై ఏబీసీడీలు తెలియవని, నేర్చుకుని రమ్మంటున్నారని, ఇంతకు మించిన అవకాశవాదం ఇంకేముంటుందని అడిగారు.

జల్లికట్టు ఉద్యమం కూడా బీజేపీపై కోపానికే కారణమని పవన్ అన్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత సీఎం జయలలిత మరణానికి అనంతరం బీజేపీ తమిళనాడును శాసించడం ఆ రాష్ట్ర యువతకు ఏమాత్రం నచ్చలేదన్నారు. ద్రవిడ పార్టీలపై బీజేపీ దాడి చేస్తుందని, జల్లికట్టు క్రీడ తమిళ సంప్రదాయంలో భాగమేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

తమిళనాడులో తాను చదువుకున్నానని.. తనకు అక్కడ స్నేహితులున్నారని.. జల్లికట్టు పెద్ద ఉద్యమం అవుతుందని వారు చెప్పినట్లే జరిగిందని.. సోషల్ మీడియా సహాయంతో జల్లికట్టుపై పోరాటం చేసి యూత్ సక్సెస్ అయ్యారన్నారు. జల్లికట్టు ఉద్యమ ఉధృతాన్ని తగ్గించారేమోకానీ.. జల్లికట్టు ఉద్యమాన్ని ఆపలేరని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి