గణతంత్ర దినోత్సవ వేడుక అంటే.. జెండా ఎగరేసి, జనగణమన పాడేసి, జైహింద్ చెప్పడం కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించడానికి ఎంతోమంది మహానుభావులు త్యాగాలు చేశారని, ఆ త్యాగాల గురించి తెలుసుకుంటే మన దేశానికి, జెండాకు మనం ఇచ్చే గౌరవమే వేరుగా ఉంటుందని అన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "1950వ సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు మన దేశంలో బ్రిటీష్ చట్టాలన్నీ తొలగిపోయి... భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు అమలవ్వడం మొదలైంది. వందలాది సంస్థానాలను తనలో విలీనం చేసుకొని భారతదేశం రిపబ్లిక్ దేశంగా అవతరించింది. మత ప్రాతిపదికన దేశ విభజన జరిగి పాకిస్థాన్ ఏర్పడినప్పుడు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
భారతదేశం గొప్పతనం ఏంటంటే అన్ని మతాలు, మత విశ్వాసాలను సమానంగా గౌరవం ఇస్తుంది. కనుకే హిందు రిపబ్లిక్‌గా దేశాన్ని ప్రకటించలేదు. ఆ అవసరం పాకిస్థాన్‌కు ఉందేమోగానీ, భారతదేశానికి లేదు. మన గుండెల్లోనే సెక్యులరిజం ఉంటుంది. మానవత్వానికి స్పందించే దేశం మనది. ఈ దేశం కోసం మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు, ఆత్మ బలిదానాలు చేశారు.
వాళ్ల శ్రమతో వచ్చిన స్వాతంత్ర్యాన్ని అనుక్షణం మనం కాపాడుకోవాలి. దేశ సమగ్రతను కాపాడుకోవడానికి అందరూ బాధ్యతతో వ్యవహరించాలి, అవసరమైన త్యాగాలకు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ కార్యాలయంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్, పార్టీ నాయకులు, జనసేన కార్యకర్తల మధ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. జాతీయ గీతాలాపన అనంతరం ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, అధికార ప్రతినిధులు పోతిన వెంకట మహేష్, అక్కల రామ్మోహన్‌రావు (గాంధీ) సుందరపు విజయ్‌కుమార్, డాక్టర్ గౌతమ్, అధ్యక్షుడు వారి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్, ఒంగోలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ షేక్ రియాజ్, పార్టీ నేతలు ముత్తంశెట్టి కృష్ణారావు, బత్తిన రాము, సయ్యద్ జిలానీ, సందీప్ పంచకర్ల, నయాబ్ కమాల్, కంచర్ల శ్రీకృష్ణ, పి.విజయ్‌కుమార్, అంకెం లక్ష్మీ శ్రీనివాస్, చెన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.