గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

ఆదివారం, 26 జనవరి 2020 (11:18 IST)
మనదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? అయితే ఈ కథనం చదవాల్సిందే. ఈ రోజున బ్రిటీషు కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దైంది. భారతదేశం సామ్యవాద, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పాటు అయ్యింది. 
 
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. దేశానికి రాజ్యాంగం తయారుచేయటానికి రాజ్యాంగ పరిషత్‌ ఏర్పడింది. రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజున గణతంత్ర దేశంగా ప్రకటించుకుని ఆ రోజునే రిపబ్లిక్ డేను జరుపుకుంటారు. అదే మనదేశం కూడా చేస్తోంది. 
 
ఈ క్రమంలో ఏర్పాటైన రాజ్యాంగ పరిషత్‌కు అధ్యక్షులుగా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగం తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, ప్రజాస్వామ్య విధానంగా రూపుదిద్దారు. అనేక సవరణల అనంతరం, 1949 నవంబర్‌ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది. 
 
భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తించబడింది. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26, నుంచి అమలుపరచింది. అందుకే ఈ రోజున గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. 
 
ఇకపోతే.. దేశ రాజధాని ఢిల్లీలో నేడు 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ త్రివర్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ మెస్సియాస్ బొల్సొనారో హాజరయ్యారు. 
 
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్ సింగ్‌, నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోడీ, రాజ్‌నాథ్ సింగ్ జాతీయ యుద్ధ స్మారక కేంద్రాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు