జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పెషల్ స్టేటస్‌పై బీజేపీ సర్కారు వ్యవహరించిన తీరుపై అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీకి బైబై చెప్పేసి వామపక్షాలతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ సేల్ కావడం కంటే.. వామపక్షాలతో ముందుకెళ్తేనే లాభం ఉంటుందన్న ఆలోచన పవన్ చేస్తున్నారన్నదే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇటీవల జరిపిన కొన్ని సర్వేల్లో ఏపీలో బీజేపీ మాటతప్పిన ఒక ద్రోహిగా ముద్ర పడిందన్న ఫీలింగ్ పవన్‌లో ఉందంటున్నారు. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా లేకపోగా, ప్రత్యేక ప్యాకేజీకి (పవన్ భాషలో పాచిపోయిన లడ్డూలు)కూ చట్టబద్ధలేకపోవడం పవన్ బీజేపీతో కటీఫ్ చెప్పేందుకు కారణమైందంటున్నారు. దీంతో వామపక్షాలవైపు పవన్ దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది.
ఇప్పటికే ఒక సందర్భంలో పవన్ కల్యాణ్, వామపక్షపార్టీలకు తమ పార్టీ సిద్ధాంతాలకు కొంత భావసారూప్యత ఉందని తెలిపారు. ఈ వార్తలను బలం చేకూరుస్తూ.. తాజాగా సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు ఏఐటీయుసీ ఏపీ కౌన్సిల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు పవన్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఏపీలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చలు జరిపామని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, భూసేకరణ కారణంగా తలెత్తిన సమస్యలు, పెద్ద నోట్ల రద్దు తదితర అంశాలపై చర్చలు జరిపామని.. ఇది కేవలం స్నేహపూర్వక భేటీ అని పవన్, రామకృష్ణ చెప్తున్నారు.