అఖిలేష్ అందుకే ఓడిపోయారు... పవన్ కళ్యాణ్

మంగళవారం, 14 మార్చి 2017 (21:45 IST)
జనసేనకు మూడు సంవత్సరాలు నిండిన సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన చెప్పినవి మాటల్లోనే...జనసేనకు అండగా ఉన్నా వారందరికీ ధన్యవాదాలు. ప్రజల్లోకి వెళ్లేందుకు 32 అంశాలను గుర్తించాం. జూన్ నుంచి పార్టీ నిర్మాణం ప్రారంభమవుతుంది. వచ్చే ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేస్తాం. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తాం. 60 శాతానికి మించి యువతకు సీట్లిస్తాం.
 
వచ్చే ఏడాది మార్చికి పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ఉంటుంది. పార్టీ నిర్మాణం పూర్తయ్యాక పొత్తులపై ఆలోచిస్తాం. ఎన్నికల సంఘం నుంచి జనసేనకు గుర్తింపు ఉంది. అధికారం వచ్చినా, రాకపోయినా ప్రజలకోసం పార్టీ ఉంటుంది. సర్వేలే మాకు కొలమానం కాదు. ఏపీ నుంచే పోటీ చేస్తా కానీ ఎక్కడి నుంచి అనేది తర్వాత చెబుతా. అనంతపురం నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తా. మా పరిమితులు మాకున్నాయి... అయితే మేం చేయదల్చుకున్నది చేస్తాం. ప్రజల కోసమే పార్టీ పోరాటం... అంతిమ లక్ష్యం అధికారం కాదు.
 
ప్రజారాజ్యం పార్టీలో వివిధ వ్యక్తుల మనస్తత్వాలను చూశాను. వారంతా వ్యక్తిగత ఎజెండాలతో పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి రానివ్వకుండా కాపుకాయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికైతే ఎన్‌డీఏలో భాగస్వామిగా లేం. చంద్రబాబు పథకాలు ప్రజల్లోకి సరిగా వెళ్లడం లేదనుకుంటున్నా. అధికారంలో ఉన్నవారిని వ్యతిరేకించడం మా పని కాదు. చిరంజీవి మా పార్టీలోకి రారు. మా ఇద్దరి ఆలోచనా విధానాలు కలవవు. కుటుంబ కలహాలతోనే యూపీలో అఖిలేష్ ఓడిపోయారు అని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి