తన అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన పార్టీ 'ప్రజారాజ్యం'. పార్టీకి చిరంజీవి అధ్యక్షుడు అయితే, ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అనుబంధ విభాగమైన యువసేనకు సేనాధిపతి. కానీ, 2009 ఎన్నికల తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుంటే పవన్ కళ్యాణ్ మాటమాత్రం స్పందించలేదు. దీనిపై అపుడు చాలా విమర్శలే వచ్చాయి. తాను నాడు అలా ఎందుకు ఉండాల్సి వచ్చిందో పవన్ కళ్యాణ్ ఇపుడు బహిర్గంత చేశారు.
అన్నయ్యగారు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తుంటే ఎందుకు నిశ్శబ్ధంగా ఉన్నాను అంటే.. నేనేప్పుడు ఒక నాయకుడిని నమ్ముతాను. సర్వెంట్ లీడర్ షిఫ్ అంటాం. ఒక ఆలోచనా విధానం పెట్టుకుని ఒక నాయకుడు ముందుకు తీసుకువెళుతున్నప్పుడు.. ఒక కెప్టెన్ షిప్‌ని నడుపుతున్నప్పుడు.. ఆ నాయకుడిగా అన్నీ తెలుసు. అందుకే ఆ నాయకుడిని నేను అనుసరిస్తా. నాకు చాలా ఇబ్బందులనిపించినాయ్. నాకేం తెలియక కాదు. కాకపోతే నేను నిస్సహాయుడ్ని. ఇప్పుడైతే నాకు బలం ఉంది. అనుభవం తర్వాత వచ్చింది. ఆ రోజు నేను చెబితే వినేలా లేదు.
ఉదాహరణకి అల్లు అరవింద్‌గారు అన్నారు. పవన్ కల్యాణ్‌ని ఫలానాచోటకి ప్రచారానికి పంపించండి అంటే.. ఎందుకండీ.. మనకు అల్లు అర్జున్ ఉన్నాడుగా, రాంచరణ్ ఉన్నాడుగా.. పంపించేయండి అన్నారు. అప్పుడు నాకనిపించింది.. నేను రాజకీయాలలోకి తెలుసుకుని వచ్చాను. అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే అల్లు అరవింద్‌గారు నన్ను నటుడిగానే చూశారు. తన కొడుకుతో పాటు, తన మేనల్లుడితో పాటు పవన్ కల్యాణ్ అనే వాడు ఒక నటుడంతే. అంతేగానీ, వారికి నాలో ఉన్న సామాజికస్పృహ మాత్రం కనిపించలేదు. ఇలాంటి వాతావరణంలో ఇంక నేను ఏం మాట్లాడితే ఎవరు వింటారండి? అందుకనే చేతులు కట్టుకుని రోధించేవాడ్ని. కన్నీళ్లు కూడా బయటికి వచ్చేవి కావు’’ అని పవన్ కల్యాణ్ అని చెప్పుకొచ్చారు.