మంగళగిరి స్థలం వివాదాస్పదమైతే లీజ్ రద్దు: పవన్ కళ్యాణ్

గురువారం, 14 డిశెంబరు 2017 (20:15 IST)
మంగళగిరిలో జనసేన కార్యాలయం కోసం తీసుకున్న స్థలంపై వచ్చిన వివాదంపై పవన్ బహిరంగ లేఖ రాశారు. అందులో... " చట్టం, న్యాయంపై అపార గౌరవం వున్న జనసేన పార్టీ కానీ, నేను కాని అధర్మబద్ధమైన పనులు చేయాలన్న ఆలోచన కూడా కనీసం చేయబోము. జనసేన పార్టీ కార్యాలయం కోసం మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద లీజుకు తీసుకున్న స్థలంపై విజయవాడలో ఈరోజు అంజుమన్ ఇస్లామిక్ కమిటీ సభ్యులు చేసిన ఆరోపణలు నా దృష్టికి వచ్చాయి. 
 
ఇక్కడ స్థలం తీసుకున్న సంగతి పత్రికాముఖంగా జనసేన వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆనాడే ముస్లిం పెద్దలు తమ గళం విప్పి వుంటే బాగుండేది లేదా ఈనెల 8,9 తేదీల్లో నేను విజయవాడలోనే వున్నాను. ఆ సమయంలో నాకు గాని పూర్టీ ప్రతినిధులకు కాని తెలియజేసి వుండవలసింది లేదా కనీసం తొమ్మిదో తేదీన నేను స్థలం సందర్శనకు వచ్చినపుడన్నా చెప్పవచ్చుకదా. 
 
కానీ ఈ రోజున ఓ రాజకీయవేత్త సమక్షంలో ఈ విషయాన్ని మీడియావారితో మాట్లాడటం అనుమానించవలసి వస్తుంది. ఇది రాజకీయ కుట్ర అయితే తట్టుకునే శక్తి జనసేనకు వుంది. గట్టిగా పోరాడే బలం కూడా వుంది. ఈ స్థలాన్ని కేవలం మూడున్నర సంవత్సరాల పాటు ఉపయోగించుకోవడానికి మాత్రమే జనసేన లీజుకు తీసుకున్నది. 
 
అందువల్ల జనసేనకు ఈ స్థలం విషయంలో దురుద్దేశాలు లేవన్న సంగతి చెప్పకనే తెలుస్తోంది. త్వరలోనే న్యాయనిపుణులతో కలిసి జనసేన ప్రతినిధులు చినకాకాని వస్తారు. మీ వద్దనున్న డాక్యుమెంట్లు వారికి ఇవ్వండి. ఆ స్థలం మీదని నిర్థారణ అయిన మరుక్షణం జనసేన ఆ స్థలానికి దూరంగా వుంటుందని హామీ ఇస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ లేఖలో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు