జామాత దశమ గ్రహం అని ఎన్టీఆర్ ఆనాడే సర్టిఫికేట్ ఇచ్చారు

శనివారం, 31 జులై 2021 (18:07 IST)
దేవినేని ఉమ ఇంట్లో పడుకుంటే కేసులు పెట్టారా?  లేక చంద్రబాబుకు సంచులు మోస్తుంటే కేసులు పెట్టారా? ఎవరిది దుర్మార్గం చంద్రబాబూ..!? అంటూ ఏపీ స‌మాచార శాఖ మంత్రి పేర్నివెంక‌ట్రామ‌య్య విరుచుప‌డ్డారు. రాజ్యాంగం చెప్పినదానికి మించి ఏపీలో సామాజిక న్యాయం ఉంద‌ని, సోషల్ ఇంజినీరింగ్‌కు నిజమైన అర్థం చెప్పిన నాయకుడు సీఎం జగన్ అని పేర్ని అన్నారు.

ఓట్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీలు.. పదవులకు అగ్రవర్ణాలు.. ఇదీ బాబు నైజం అని చెప్పారు. బీసీల పార్టీ అని చెప్పి బీసీలను బాబు దారుణంగా మోసం చేశాడు... 5 ఏళ్ళలో ఒక్క రాజ్యసభ స్థానం కూడా బాబు బీసీలకు ఇవ్వలేద‌ని విమ‌ర్శించారు. వినూత్నమైన రాజకీయ విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్ అని, ఏ రాజకీయ పార్టీ అయినా సమదృష్టితో చూసే ప్రభుత్వం త‌మ‌ది అన్నారు. 
 
చంద్రబాబు "జామాత దశమ గ్రహం" అని ఎన్టీఆర్ ఆనాడే సర్టిఫికేట్ ఇచ్చార‌ని, ఖాకీ యూనిఫామ్‌ నిఖార్సుగా పని చేస్తున్నది జ‌గన్‌ ప్రభుత్వంలోనే అని మంత్రి కితాబు ఇచ్చారు. దేవినేని ఉమాపై కేసు పెట్టడం దుర్మార్గం అంటున్నచంద్రబాబుకు, ఆయనపై ఎందుకు కేసు పెట్టారో తెలియదా..? అని రాష్ట్ర రవాణా, సమాచార శాఖా మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య(నాని) ప్రశ్నించారు.  దేవినేని ఉమ ఇంట్లో పడుకుంటేనో లేక మీ సంచులు మోస్తుంటేనో కేసులు పెట్టలేదని, దళితులపై దాడి చేసి, ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి, అలజడి సృష్టించినందుకే కేసు పెట్టారన్న విషయాన్ని గ్రహించాలని స్పష్టం చేశారు.
 
 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు, దేవినేని ఉమాలు ఎన్ని కొండలను పిండి చేసి తినేశారో.. శాటిలైట్‌ గూగుల్ మ్యాప్‌లే చెబుతున్నాయని, ఇవాళ డ్రామాలకు తెరలేపి రాజకీయాలు చేద్దామంటే ఎవరూ ఊరుకోరు అని తేల్చి చెప్పారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు అధికారంలో ఉండగా ఏం చేశాడని మంత్రి నాని నిలదీశారు. ఆ వర్గాల ఓట్లు మాత్రం కావాలి.. పదవులు ఇవ్వటానికి మాత్రం మీకు అగ్రవర్ణాలు కావాలి.. అని మండిపడ్డారు. అధికారంలో ఉన్న గత 5 ఏళ్ళలో చంద్రబాబు బీసీలకు ఏనాడైనా రాజ్యసభలో స్థానం కల్పించాడా అని ప్రశ్నించారు. 
 
తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..  చంద్రబాబు చెప్పేంత దుర్మార్గపు ప్రభుత్వమే మాది అయితే హైదరాబాద్‌ నుంచి బాబు గొల్లపూడికి రాగలరా? అని ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీ అయినా సమదృష్టితో చూసే ప్రభుత్వం ఇది అని అన్నారు. మీకు ప్రజలు మరొకసారి తెడ్డు కాల్చి వాతపెట్టే రోజులు ముందున్నాయని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు