బ్ర‌హ్మోత్స‌వాల‌లో భ‌క్తుల‌కు నిరంత‌రాయంగా ల‌డ్డూ

గురువారం, 12 సెప్టెంబరు 2019 (08:50 IST)
శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలలో తిరుమ‌లకు విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంత‌రాయంగా ల‌డ్డూ ప్ర‌సాదాలు పంపిణీకి ప‌టిష్ఠమైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాధ్ తెలిపారు.

తిరుమ‌ల‌లోని పిఏసి-4లోని స‌మావేశ మందిరంలో బుధ‌వారం శ్రీ‌వారి ఆల‌యం, పోటు, విజిలెన్స్‌, బ్యాంక్ అధికారుల‌ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా డెప్యూటీ ఈవో మాట్లాడుతూ బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో ముఖ్యంగా గ‌రుడ‌సేవ‌నాడు ల‌డ్డూ ప్ర‌సాదాల పంపిణీలో ఏదైన సాంకేతిక స‌మ‌స్య ఎదురైతే, ప్ర‌త్య‌మ్నాయ చ‌ర్య‌ల‌పై స‌మాలోచ‌న‌లు చేశామ‌న్నారు.

ల‌డ్డూ కౌంట‌ర్ల‌కు అద‌నంగా మ‌రో ఇంట‌ర్‌నెట్ లైన్, సాంకేతిక సిబ్బందితో టీంను ఏర్పాటు చేయాల‌న్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, శ్రీ‌వారి ఆల‌యం, ల‌డ్డూ కౌంట‌ర్ల‌లో ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా విధులు నిర్వ‌హించాల‌ని సిబ్బందిని కోరారు.
 
ఎక్కువ మంది దర్శించుకునేలా ఏర్పాట్లు
తిరుపతి, ఇతర ప్రాంతాల్లోని అనుబంధ ఆలయాలను మరింత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి తిరుపతి జెఈవో  పి.బసంత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆయా ఆలయాల్లో ఆర్జితసేవలు(ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌), అవసరమైన సిబ్బంది, భద్రత, ఇంజినీరింగ్‌ పనులు, ప్రచారం తదితర అంశాలపై చర్చించారు. ఆలయాల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్‌ అధికారులు, సంబంధిత డెప్యూటీ ఈవోలు ఎప్పటికప్పుడు సమీక్షించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. ఆలయాల ప్రాశస్త్యంపై డాక్యుమెంటరీలు రూపొందించి ఎస్వీబీసీలో ప్రసారం చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా, ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయం ఇతర అనుబంధ ఆలయాలు, శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం ఇతర అనుబంధ ఆలయాలు, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఇతర అనుబంధ ఆలయాలు, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఇతర అనుబంధ ఆలయాలు, తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం ఇతర అనుబంధ ఆలయాలు, తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయం ఇతర అనుబంధ ఆలయాలు, ఇతర ప్రాంతాల్లోని ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇతర అంశాలపై జెఈవో సమీక్షించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు