ఏపీకి పోలవరం గుండెలాంటిది: కన్నా

శనివారం, 12 అక్టోబరు 2019 (08:15 IST)
ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు గుండె లాంటిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మోదీ ప్రధాని అయ్యాక పోలవరం ప్రాజెక్టు కోసం ముంపు ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపారని వెల్లడించారు.

ఇంతటి గొప్ప ప్రాజెక్టు పూర్తి చేయడానికి నూటికి నూరుశాతం నిధులు ఇచ్చి పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని పర్యాటక కేంద్రంగా చూసిందే తప్ప.. సీరియస్‌గా ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయిందన్నారు.

ఈ నాలుగు నెలల్లో ప్రాజెక్టు పనులు ఎక్కడ వరకు వచ్చాయో చూద్దామని పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నట్లు తెలిపారు. పోలవరంలో అవినీతిని నిరూపించి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

పోలవరంలో అవినీతి ఎక్కడ జరిగిందో కనిపెట్టలేకపోయిందని ఎద్దేవాచేశారు. ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని కలిసి ఒక నివేదిక అందజేస్తామని స్పష్టం చేశారు. పోలవరం పురోగతి, అవినీతి ఆరోపణలపై వివరిస్తామన్నారు.

పోలవరం త్వరగా పూర్తి కావాలనేదే బీజేపీ సంకల్పమని వివరించారు. జగన్ సర్కారు పోలవరం అవినీతి బూచి చూపించి కావాల్సిన పనులు చేయించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు