రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు రాచమర్యాదలు కల్పించేందుకు గుంటూరు అరండల్‌పేట పోలీసులు రూ.5 లక్షలు లంచంగా ఇచ్చినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు అరండల్ పేట పోలీస్ స్టేషనులో అందిన రాచమర్యాదల వ్యవహారంలో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఐ కొంకా శ్రీనివాసరావును వీఆర్‌కు పంపగా... నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
ఈ వ్యవహారం అంతటితో ముగిసిందని అంతా భావించారు. కానీ... పోలీస్ స్టేషనులోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీస్ అధికారులకు మతిపోయినంతపనైంది. పోలీస్ అధికారులకు పెద్దమొత్తంలో డబ్బు ముట్టడం వల్లే బోరుగడ్డ అనిల్... స్టేషన్‌ను తన పిక్నిక్ పాయింట్‌గా మార్చుకున్నట్టు గుర్తించారు. ఈ విషయంలో ఠాణాలోని పోలీసులంతా మిన్నకుండిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారం వెనుక గుంటూరుకు చెందిన వైసీపీ ముఖ్య నేత పైస్థాయిలో చక్రం తిప్పినట్టు తెలిసింది. ఆ వైసీపీ నేతకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక పోలీస్ అధికారి ద్వారా రూ.5 లక్షలు పంపినట్లు తెలుస్తోంది. అందులో రూ.2 లక్షలు మరో అధికారికి ఇవ్వగా, మిగిలిన రూ.3 లక్షలు ఎవరికి అందాయనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.
ఆ అధికారి స్టేషనులో ఉండగా.. ఓ రోజు అర్థరాత్రి సమయంలో బోరుగడ్డ తనయుడు, ఆయన భార్య, మామ దర్జాగా లోపలికి వచ్చి కూర్చున్నట్లు సీసీ కెమెరా ఫుటేజీల్లో గుర్తించారు. బోరుగడ్డ తన కుమారుడిని ఆరగంట సేపు ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దాడిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అనిల్‌కు కస్టడీలో ఇబ్బందిలేకుండా, నోరు విప్పకుండా చూసేందుకు వైసీపీ అధిష్టానం ఈ పని చేసినట్లు తెలిసింది.