బోయినపల్లి కిడ్నాప్ కేసులో నిందితుడైన ఎపి మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్ బెంగళూరులో ఉన్నట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. అతని కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సమీప బంధువులైన ముగ్గురిని కిడ్నాప్ చేయించడం కోసం గుంటూరు, కర్నూలు జిల్లాలకు చెందిన 15 మందిని భార్గవరామ్ రప్పించాడని పోలీసులు తెలిపారు.
కిడ్నాప్‌కు పాల్పడిన దుండగులు టోల్‌ప్లాజాలవైపు వెళితే దొరికిపోతామన్న ఉద్దేశంతో అవి లేని సర్వీస్ రోడ్ల మీదుగా బెంగళూరు వైపు పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. కిడ్నాప్ కు పథకం రచించిన భార్గవ్‌రామ్‌కు నేర చరిత్ర ఉందని, పలు ఆర్థిక నేరాల్లో ఆయన పాత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఇకపోతే.. మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు బుధవారం రాత్రి చంచల్ గూడ జైలుకు తరలించారు. రిమాండ్ అనంతరం అఖిలప్రియ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేశారు. గురువారం బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరగనున్నాయి. అఖిలప్రియను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారంటూ అఖిలప్రియ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.