పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజా ధర్నాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. రాష్ట్రంలో 3 లక్షల టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 300 చ.అ. కలిగిన లక్షా 80 వేల ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. టిడ్కో ఇళ్లకు 31 వేల కోట్లు కేంద్రం మంజూరు చేస్తే, అందులో సగం మేత మేశారని ఆరోపించారు.
రోడ్లు, డ్రైనేజీ, కుళాయి, డ్రైనేజీ కి మళ్లీ నిధులివ్వాలని ఏపీ ప్రభుత్వం అడుగుతోందని, స్థానిక సమస్యల్లో ఇదే పెద్ద అంశంగా బీజేపీ గుర్తించిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. సత్యసాయి స్కీం నిలిపి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రెండు నియోజకవర్గాల్లో నీళ్లు కొనుక్కునే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. ప్రభుత్వం బాధ్యత వహించి, జలశక్తి పథకం ద్వారా వాటర్ స్కీం ను పునరుద్ధరించాలని డిమాండు చేశారు. అలాగే, గతంలో ఏలూరులో వచ్చిన వింత వ్యాధిపై రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు బహిర్గతం చేయాలని సోము వీర్రాజు డిమాండు చేశారు. ఈ ధర్నాలో మాజీమంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, జిల్లా అధ్యక్షుడు సుధాకర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.