ప్రణబ్ సేవ‌లు ఆద‌ర్శ‌నీయం: గవర్నర్ హరిచందన్ విచారం

సోమవారం, 31 ఆగస్టు 2020 (19:01 IST)
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ చేసిన సేవలను గవర్నర్ హరిచందన్ గుర్తుచేసుకున్నారు.

దివంగత ప్రణబ్ ముఖర్జీ ఐదు దశాబ్దాలు పాటు ప్రభుత్వంతో పాటు పార్లమెంటు ద్వారానూ దేశానికి ఆదర్శప్రాయమైన సేవలను అందించారన్నారు.

ఈ నేపధ్యంలో సోమవారం గవర్నర్ హరిచందన్ సంతాప సందేశం విడుదల చేస్తూ స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ విదేశీ, రక్షణ, వాణిజ్యం, ఆర్థిక మంత్రిగా వేర్వేరు సమయాల్లో పనిచేసి అరుదైన ఘనతను కలిగి ఉన్నారని, సమాచార హక్కు, ఉపాధి హక్కు, ఆహార భద్రత, యుఐడిఎఐ ఏర్పాటు వంటి ముఖ్యమైన చట్టాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారన్నారు.

ప్రణబ్ ముఖర్జీ ఒక శక్తివంతమైన వక్త, పండితుడు, మేధావి, అపారమైన రాజకీయ చతురత కలిగిన నాయకుడని, కష్టతరమైన జాతీయ సమస్యలపై బహుళ పార్టీ ప్రజాస్వామ్యంలో భాగమైన రాజకీయ పక్షాల మధ్య ఐక్యతను సాధించి ఏకాభిప్రాయ సాధకునిగా తన భూమికకు ప్రశంసలు అందుకున్నారని బిశ్వభూషణ్ హరిచందన్ గుర్తుచేశారు. ముఖర్జీ కుటుంబ సభ్యులకు గవర్నర్ హృదయపూర్వక సంతాపం తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు