వంశధారపై బ్యారేజీ నిర్మాణానికి సన్నాహాలు చేయండి: సీఎం జగన్

మంగళవారం, 22 జూన్ 2021 (16:52 IST)
అమరావతి: వంశధారపై ట్రైబ్యునల్‌ తీర్పు పట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సంతోషం వ్యక్తంచేశారు. సుదీర్ఘకాలం తర్వాత ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లైందన్నారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కాగానే వెంటనే నేరడి వద్ద వంశధారపై బ్యారేజీ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
 
ఈలోగా దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసుకోవాలన్నారు. ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పు ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే కాకుండా ఒడిశాకూ ప్రయోజకరమన్నారు. పొరుగు రాష్ట్రాలతో సంత్సంబంధాలు కోరుకుంటున్నామని, నేరడి బ్యారేజీ ద్వారా ఇరు రాష్ట్రాల ప్రజలకూ మంచి జరుగుతుందన్నారు.
 
నేరడి బ్యారేజ్‌ నిర్మాణం కోసం జరిగే శంఖుస్థాపన కార్యక్రమానికి ఒడిశా సీఎంతో పాటు, ఆ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తామన్నారు. వివాదాలతో కాకుండా పరస్పర సహకారంతో ముందుకు సాగాలన్నదే తమ విధానమన్నారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి... వంశధార ట్రైబ్యునల్‌ తీర్పుపై మాట్లాడారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు