శ్రీకాకుళంలో గురుపూజోత్సవం నాడు ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు వినూత్న రీతిలో తెలియజేసిన నిరసన అందరికీ కళ్లుచెమర్చేలా చేస్తోంది. డా. సర్వేపల్లి రాధాకృష్ణగారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకునే టీచర్స్ డే నాడు తమలాంటి ప్రైవేట్ టీచర్లు ఎదుర్కొంటున్న అవస్థలను తెలియజేస్తూ సంతబొమ్మాళికి చెందిన ఆంగ్ల ఉపాధ్యాయులు అట్టాడ మోహనరావు తన ఆవేదనను వ్యక్తం చేశారు.
అటు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం... ఇటు ప్రభుత్వం ఎవరూ కరోనా సమయంలో ఆదుకోక పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటోను పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు చిరు వ్యాపారం చేసుకుందామన్నా ఆర్ధిక స్తోమత లేదని కంటతడి పెట్టుకున్నారు. దయనీయ స్థితిలో ఉన్న ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులను ప్రభుత్వమైనా ఆదుకోవాలని వేడుకున్నారు.