శాస్త్రీయతోనే లాభదాయకమైన సాగు: ఎమ్మెల్యే అంబటి రాంబాబు

గురువారం, 28 అక్టోబరు 2021 (22:56 IST)
నిరంతర శ్రమైక జీవనమే వ్యవసాయమని శాసనసభ్యులు అంబటి రాంబాబు అన్నారు. గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన కిసాన్ చర్చా గోష్ఠి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఏడీఏ కె.అమలకుమారి అధ్యక్షత వహించారు.
 
 ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ మూసవిధానంలో కాకుండా శాస్త్రీయ, సాంకేతిక యాంత్రిక విధానంలో లాభదాయకమైన సాగు చేయాలని సూచించారు. శాస్త్రవేత్తల, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందే పంటలను పండించాలన్నారు.పంట మార్పిడి విధానం పాటించాలన్నారు.

సేంద్రీయ వ్యవసాయం తో ఫలితాలు సత్వరం రాకపోయినా విషతుల్యం కాని ఆహారపదార్దాలు లభ్యమవుతాయన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు.

గతంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం రైతులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో తీసుకొచ్చిందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు వ్యవసాయ సేవలను ఇంటిముంగిటే పొందుతున్నారని వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి  రైతులకు అండగా ఉన్నారన్నారు.  
 
జెడిఎ విజయభారతి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మిర్చి పంట విస్తీర్ణం గతంలో కంటే ఈ ఏడాది పెరిగిందన్నారు. వాణిజ్య పంటల సాగుపై రైతులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారని వివరించారు. ప్రస్తుతం గులాబి రంగు పురుగు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

శాస్త్ర వేత్తల, అధికారుల సలహాలు పాటించాలని సూచించారు. సమావేశంలో కొమెరపూడి రైతులకు లింగాకార బుట్టలు పంపిణీ చేశారు .వ్యవసాయ సంబంధిత గోడ పత్రికలను,రైతు భరోసా మాస పత్రికను ఆవిష్కరించారు. ఈ నియోజకవర్గంలో వ్యవసాయరంగ పరిస్థితిని ఏడీఏ అమలకుమారి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులు తమ అనుమానాలను నివృత్తి చేసుకొని వ్యవసాయ పరిజ్ఞానం మెరుగుపరుచుకునేందుకు దోహదపడుతుందన్నారు.
 
 ఏఎంసీ చైర్మన్ రాయపాటి పురుషోత్తమ రావు, వైస్ చైర్మన్ గార్లపాటి ప్రభాకర్, ఎంపీపీ జై బూన్ బి, జెడ్ పి టి సి సభ్యులు సంకటి నాగేశ్వరమ్మ,  హార్టికల్చర్ జెడిఎ కృష్ణారెడ్డి,ఏడీ ఏ శివ కుమారి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త గంగాభవాని, జెడీ ఏ కార్యాలయ ఏడీ ఏ హేమలత,  నాయకులు కట్టా సాంబయ్య, సచివాలయ సిబ్బంది, రైతులు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు