సీఎం జగన్‌కు రఘురామ మరో లేఖాస్త్రం... సభ్యత్వం ఎలా రద్దు చేస్తారు?

ఆదివారం, 13 జూన్ 2021 (10:33 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. వైఎస్సార్ పెళ్లికానుక, షాదీ ముబారక్ పథకాలపై రఘురామ లేఖ రాశారు. అధికారంలోకి వస్తే పెళ్లికానుక ఆర్థికసాయం పెంచుతామన్నారని ఆయన గుర్తుచేశారు. 
 
పెళ్లి కానుక ఆర్థిక సాయాన్ని రూ.లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించారన్నారు. పెళ్లికానుక పథకంపై ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని రఘురామ లేఖలో సూచించారు. 
 
వైసీపీ నర్సాపురం ఎంపీ కనుమూరి ర‌ఘురామకృష్ణంరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆ పార్టీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ శుక్రవారం ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. 
 
ఈ విషయంపై ఎంపీ ర‌ఘురామ స్పందించారు. శనివారం ర‌ఘురామ మీడియాతో మాట్లాడుతూ..  తనపై  వైసీపీ ప్రభుత్వం అన‌ర్హత వేటు వేయ‌డం సాధ్యం కాదన్నారు. తాను ఏ పార్టీతోనూ జట్టుక‌ట్టలేదని స్పష్టంచేశారు.
 
అధికార పార్టీ కార్యక‌లాపాల‌కు విరుద్ధంగా వ్యవ‌హ‌రించ‌లేదని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ ఫ‌లితాల అమ‌ల్లో లోపాల‌ను మాత్రమే ప్రస్తావించానన్నారు. కొంత‌మంది త‌ప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్రయ‌త్నం చేశానన్నారు. వాస్తవాలు ఎప్పటికైనా బ‌య‌ట‌కు వ‌స్తాయని ర‌ఘురామ తెలిపారు. 
 
తనపై దాడి చేసిన వారి విష‌యంలో మ‌రోసారి ప్రివిలైజ్‌ మోష‌న్ ఇస్తానని ర‌ఘురామ తెలిపారు. తనపై ఈనెల 10వ తేదీన ఫిర్యాదు చేసి 11వ తేదీన ఫిర్యాదు చేసిన‌ట్లుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారని ర‌ఘురామ మండిపడ్డారు. 
 
హోంమంత్రి సుచరిత, సీఎం జగన్‌ని క‌లిశాకే కొంతమంది నాయకులు ఇలా ఫిర్యాదు చేసిన‌ట్లు చెబుతున్నారన్నారు. తనపై అన‌ర్హత వేటుపై ఇప్పటికే నాలుగైదు సార్లు ఫిర్యాదు చేశారని ర‌ఘురామ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు