శ్రీవారి సేవ కోసం ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. ఇదే ఆఖరి పోరాటం : రాయపాటి

మంగళవారం, 2 మే 2017 (16:47 IST)
రాయపాటి సాంబశివరావు. రాష్ట్రంలో ఉన్న బడా పారిశ్రామికవేత్తల్లో ఒకరు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరారు. ప్రస్తుతం నర్సారావుపేట ఎంపీగా కొనసాగుతున్నారు. ఈయన చిరకాల కోరిక.. శ్రీవారికి సేవ చేయాలన్నది. అదే తిరుమల తిరపతి దేవస్థానం ఛైర్మన్‌గా పని చేయాలన్నది. ఇందుకోసం గత 15 యేళ్లుగా కృషి చేస్తున్నారు. కానీ, తితిదే ఛైర్మన్ గిరి అన్నది ఆయనకు అందని ద్రాక్షలా మారింది. 
 
తన చిరకాల వాంఛ అయిన టీటీడీ ఛైర్మన్ పదవికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ పదవి కోసం ఆయన రెండుసార్లు ప్రయత్నించారు. అయితే అప్పట్లో డీకే.ఆదికేశవులు నాయుడు ఒకసారి, కనుమూరి బాపిరాజు మరోసారి ఆ పదవిని సొంతం చేసుకున్నారు. ఇపుడు మరోమారు ఆశపడ్డారు. 
 
ప్రస్తుతం తితిదే పాలక మండలి పదవీకాలం ముగిసింది. దీంతో కొత్త పాలకమండలిలో తనకు చోటు దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇదే అంశంపై ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు కూడా జరిపారు. కానీ, ఆయన నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్టు కనిపించలేదు. 
 
ఈ నేపథ్యంలో తితిదే ఛైర్మన్ గిరిపై తనకున్న కోర్కెను రాయపాటి బహిర్గతం చేశారు. ఈ దఫా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ రెండు పదవులు ఉండకూడని పార్టీ భావించే పక్షంలో ఎంపీ పదవిని వదులుకునేందుకు కూడా సిద్ధమని చంద్రబాబుకు లేఖ రాశారు. ఆరు సార్లు ఎంపీగా పనిచేశానని... ప్రస్తుతం తనకు ఎంపీ పదవికన్నా టీటీడీ ఛైర్మన్ పదవే ముఖ్యమని లేఖలో పేర్కొన్నారు. మరి ఈసారైనా ఆయన కోరిక నెరవేరుతుందేమో వేచి చూడాలి. 

వెబ్దునియా పై చదవండి