పది పరీక్షలు జూలై 10వ తేదీ నుంచి 15వ వరకు నిర్వహించనున్నారు. రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45కు పరీక్షలు జరగనున్నాయి. గుంటూరు జిల్లాలో పరీక్షలకు మొత్తం దాదాపు 59వేలమంది హాజరుకానున్నారు.
ఇందులో ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఉండేవారు దాదాపు 5వేల నుంచి 8వేల వరకు ఉన్నట్లు సమాచారం. దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడ ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్నారు.
పరీక్షలకు వారు ఇక్కడికి రాకుండా సొంత జిల్లాల్లోనే అందుబాటులో ఉన్న కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో విద్యాశాఖ వర్గాలు ఉన్నాయి. ప్రధానంగా గుంటూరు, కృష్ణాజిల్లాల్లోనే అత్యధిక మంది ఇతర జిల్లాల విద్యార్థులు ఉంటారు.
వారికి హాల్‌టిక్కెట్లు జారీచేసి సమీపంలో కేంద్రాల్లో పరీక్షలు రాసేలా సన్నాహాలు చేయాలని భావిస్తున్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే.. ఇతర జిల్లాల విద్యార్థులు తాము చదివిన చోటుకు వచ్చి పరీక్షలు రాయాలంటే ప్రసుత పరిస్థితిలో వారితోపాటు కనీసం ఒకరు ఉండాలి.
ఇందుకు హాస్టల్స్‌లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు జిల్లాలోని అనేక ప్రైవేటు స్కూల్స్ హాస్టల్స్ క్వారంటైన్ కేంద్రాలుగా ఉన్నాయి. అక్కడ ఉన్న వారిని ఇప్పటికిప్పుడు ఖాళీ చేయించాలంటే వీలుకాని పరిస్థితి.
ఈ నేపథ్యంలో ఎక్కడి వారికి అక్కేడే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనిపై విద్యాశాఖ వర్గాలను సంప్రదించగా రాష్ట్రస్థాయిలో దీనిపై చర్చలు జరుగుతున్నాయని రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి సమాచారం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.