ఆంధ్రప్రదేశ్‌లో భానుడు భగభగమంటున్నాడు. యాస్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులు వాతావరణం కాస్త చల్లబడినా… మళ్లీ వాతావరణం వేడెక్కింది. వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించింది.
గురువారం (మే 27,2021) తూర్పుగోదావరి జిల్లాలో 12, విజయనగరం జిల్లాలో 2 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లాలో 36, కృష్ణాలో 15 మండలాలు మిగిలిన చోట్ల.. మొత్తం 68 మండలాల్లో వడగాలుల తీవ్రత ఉంటుందన్నారు.
ఇక శుక్రవారం తూర్పుగోదావరి 3 మండలాల్లో, శనివారం తూర్పుగోదావరి 28, పశ్చిమగోదావరి 18, విజయనగరంలో 14 మండలాలు మిగిలిన చోట్ల మొత్తం 63 మండలాల్లో వడగాలులు వీచే అవకాశమున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
ఎండలు, వడగాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశముండటంతో ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని.. అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. అత్యవసరం అయితే బయటకు రావొద్దంది. అలాంటి సందర్భంలో ఎండ తీవ్రత, వడగాలుల బారిన పడకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.