రానా, రకుల్‌ని ఈడీ పిలిస్తే... కేటీఆర్‌‌కు ఎందుకు ఉలికిపాటు?

సోమవారం, 20 సెప్టెంబరు 2021 (16:06 IST)
ఎక్సైజ్ శాఖ విచారణ నివేదికను ఎందుకు ఈడీకి ఇవ్వడం లేదు? ఐపీఎస్‌ అధికారి అకున్ సభర్వాల్ కమిటీ ఏమైంది? అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన ఆయన సోమవారం ఉదయం గన్‌పార్క్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, అకున్ సబర్వాల్‌కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. డ్రగ్స్ కేసు విచారణలో ఉండగానే అకున్ సబర్వాల్‌ని తప్పించారు. బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ వరకూ పబ్బులు వ్యాప్తి చెందాయి. విదేశాల నుంచి వచ్చిన డ్రగ్స్, గంజాయి వాడకం ఎక్కువైంది. కేటీఆర్‌కి బాధ్యత లేదా? పిల్లలు డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా? కేటీఆర్ ఎదురు దాడి చేస్తున్నారు అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఎవరు నేరగాళ్లనే చర్చ తర్వాత చేద్దాం. అమర వీరుల స్తూపం ముందు మేము రెడీగా ఉన్నాం. మా తండ్రి, తాత, ముత్తాత చరిత్ర కూడా చర్చిద్దాం. డ్రగ్స్ కేసు చర్చ పక్కదారి పట్టించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారు. మీ ఆస్తులు అడగడం లేదు. రానా, రకుల్ ప్రీత్ సింగ్‌ని ఈడీ పిలిచింది. వాళ్ళని నేను అంటుంటే కేటీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు. కేసులు వేస్తాం అని బెదిరిస్తున్నారు. కేటీఆర్ నీ స్థాయి పెద్దది అనుకుంటున్నావు. నువ్వు ఎమ్మెల్యే కాకముందే నేను ఎమ్మెల్సీ అయ్యాను. నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే‌గా కేవలం 100 ఓట్లతోనే గెలిచావు అని రేవంత్ చెప్పారు. 
 
రాజకీయాల పరంగా చూస్తే కేటీఆర్ నువ్వు నా వెంట్రుకతో సమానం. డ్రగ్ టెస్టుకు రా అని నేను అడిగానా.. నువ్వు అడిగావా? నువ్వు విసిరిన సవాల్‌నే నేను స్వీకరించా. మరో ఇద్దరికి సవాల్ విసిరా. గన్ పార్క్‌కి అర గంట ముందే కేటీఆర్ వస్తారు అనుకున్నా. రాహుల్ గాంధీని రమ్మని చెప్పిన కేటీఆర్.. ఇవాంక ట్రంప్‌ని కూడా రమ్మని అడుగుతారేమో. డ్రగ్స్‌తో నీకు సంబంధం ఉందని అన్నామా. నువ్వే డ్రగ్స్ టెస్టుకు సిద్ధమేనని సవాల్ చేశావు. కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ సవాల్ నేను స్వీకరించకపోతే... జనానికి అనుమానం వస్తుంది. ఆయన చెప్పిన మాటలకు నేను వైట్ ఛాలెంజ్ అని విసిరా. కేటీఆర్‌ని కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే. కేటీఆర్ స్లీపింగ్ ప్రెసిడెంట్‌గా మారిపోయాడు అని రేవంత్ విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు