ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో అక్క చనిపోగా, చెల్లి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరింది. ఇపుడు ఈమె కోలుకోవడంతో ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత చెల్లెలు పావని గొంతు విప్పింది. రోడ్డు ప్రమాదం ముసుగులో కోరలు చాపిన మృగాళ్ల వికృతత్వాన్ని వెలుగులోకి తెచ్చింది. బాధితురులాలు వెల్లడించిన వివరాల మేరకు..
నరసాపురానికి చెందిన పావని అక్క గౌతమి గ్రూప్-1కి సిద్ధమవుతోంది. మూడు నెలలుగా విశాఖలో కోచింగ్ తీసుకుంటుంది. చెల్లెలిని ఎక్కించుకొని గౌతమి స్కూటీపై బయలుదేరింది. సరిగ్గా అదే మార్గంలో వచ్చిన విశాఖకు చెందిన వాహనం దూసుకొచ్చింది. ఇది పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం- పాలకొల్లు మధ్య జాతీయ రహదారిపై జరిగింది. ఆ తర్వాత ఏమి జరిగిందనేది పావని కళ్లకు కట్టినట్టు వివరించింది.
'పాలకొల్లు నుంచి మా స్కూటీని వెంబడించారు. మేం వేగం పెంచితే, మరింత దూకుడుగా దూసుకొచ్చారు. మేం తగ్గితే.. వారూ స్లో అయ్యేవారు. చాలాదూరం ఇలాగే అమానుషంగా వెంటాడారు. మమ్మల్ని తరుముకొస్తుంది పోకిరీలని మాకు అర్థం అయింది. వారికి దారి ఇద్దామని రోడ్డు దిగి.. చిన్నగా వెళుతున్నాం. ఒకటి, రెండుసార్లు గుద్దడానికి ప్రయత్నించగా, తప్పించుకొన్నాం. అయినా, వదలలేదు. వేగంగా వచ్చి ఢీకొట్టేశారు. అక్క ఎటో పడిపోయింది. నేను కారు బానేట్‌పై పడిపోయాను. రక్షించాలని కేకలు వేశాను. అయినా, వదల్లేదు. ఆడపిల్లలని జాలీ చూపలేదు. అంతంతకు వేగం పెంచేశారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. కళ్లు తెరిచేసరికి నేను ఆస్పత్రిలో పడి ఉన్నాను' అని పావని వివరించింది.
ఈ ప్రమాదంపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. కమిషన్ సభ్యురాలు డాక్టర్ శిరినినీడి రాజ్యలక్ష్మి.. నరసాపురం ఆస్పత్రిలో పావనిని పరామర్శించారు. కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని, దోషులు ఎంతటివారైనా శిక్ష పడేలా చర్యలు తీసుకొంటామని భరోసా ఇచ్చారు. డీఎస్పీని కలిసి కేసును దర్యాప్తుపై ఆరా తీశారు.