పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు... మంత్రి కాలవ శ్రీనివాసులు

మంగళవారం, 19 జూన్ 2018 (20:32 IST)
అమరావతి : రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల గృహ నిర్మాణ పథకాన్ని ముందుకు తీసుకొనివెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తన చర్యలు వేగవంతం చేసినట్లు రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. జర్నలిస్టుల గృహ నిర్మాణ పధకంలో భాగంగా గృహ నిర్మాణ నిమిత్తం పాత్రికేయులకు రాయితీ క్రింద రూ.100 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. 
 
జర్నలిస్టుల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఈ పధకానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. జర్నలిస్టుల గృహ నిర్మాణం కోసం అవసరమైతే అదనంగా నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 
 
ప్రభుత్వ గృహ నిర్మాణ పధకాల లబ్ధిదారులకు అందించే రాయితీలకు అదనంగా జర్నలిస్టుల గృహ నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాలలో రూ.1 లక్ష , పట్టణాలలో రూ.1.5 లక్షలు రాయితీగా మంజూరు చేసేందుకు ఈ నిధులు వినియోగించనున్నాట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు సమాచార శాఖకు రూ.100 కోట్లు అదనపు బడ్జెట్ ను మంజూరు చేస్తూ ఆర్ధిక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారని మంత్రి పేర్కొన్నారు. జర్నలిస్టుల గృహ నిర్మాణ పధకంకు మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తామని మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు