వరద ముంపు బాధిత కుటుంబాలకు రూ.రెండు వేలు సహాయం: మంత్రి కృష్ణదాస్

మంగళవారం, 18 ఆగస్టు 2020 (22:41 IST)
భారీ వరదల కారణంగా కష్టాలను ఎదుర్కొంటున్న ప్రతీ కుటుంబాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,  రెవెన్యూ, పునరావాస శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపి విశ్వరూప్,రాష్ట్ర బి.సి. సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, అమలాపురం ఎం.పి చింతా అనూరాధ, మాల కార్పొరేషన్ చైర్మన్ పి అమ్మాజీ, కోనసీమలోని వివిధ నియోజక వర్గాల శాసనసభ్యులుతో కలిసి కృష్ణదాస్ కోనసీమలోని ముంపునకు గురైన లంక గ్రామాలు సందర్శించి, వరద బాధితులను పరామర్శించారు.

అనంతరం అమలాపురం ఆర్.డి. ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరదల కారణంగా ఏ ఒక్క కుటుంబం కష్టాల బారిన పడకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. వరద బాధితులకు వరద సహాయం తో బాటు ఆదనంగా కుటుంబానికి రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచించారని ఉప ముఖ్య మంత్రి తెలిపారు. వరద ప్రాంతాలలో ప్రజా ప్రతినిధులు పర్యటించి బాధితులకు సహాయ సహకారాలు అందించాలని ముఖ్య మంత్రి ఆదేశించారని తెలిపారు.
 
తొలుత తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామంలో ముంపునకు గురైన వ్యవసాయ పొలాలను పరిశీలించి, అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. అనంతరం అయినాపురం గ్రామంలో వరద కారణంగా నష్టపోయిన 20మంది బాధితులకు గ్రామ సచివాలయం వద్ద బియ్యం, 1కేజీ శనగలు, నిత్యావసర వస్తువులను ఇంచార్జి మంత్రివర్యులు ధర్మాన కృష్ణదాస్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ లు చేతులమీదుగా పంపిణీ చేశారు.
 
వరద సహాయక చర్యల పై అధికారులతో ఇంచార్జి మంత్రి సమీక్ష :
వరద ముంపునకి గురైన ప్రాంతాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి వరద బాధితులను ఆదుకోవాలని ధర్మాన కృష్ణదాస్ తెలియ చేశారు. కోనసీమలో వరద ముంపునకు గురైన ప్రాంతాలలో చేపట్టవలసిన సహాయక చర్యలు పై వివిధ శాఖల అధికారులతో అమలాపురం ఆర్.డి. ఓ కార్యాలయంలో ఇంచార్జి మంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. వరదల కారణంగా నష్టపోయిన అందరినీ పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఆదుకుంటుందని, వరద బాధితులకు వరద సహాయంతో బాటు అదనంగా కుటుంబానికి రెండు వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తుందని, అధికారులు మీమీ మండలాలలో వరద పరిస్తితులను పర్యవేక్షిస్తూ వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

అలాగే వరదల కారణంగా నష్టపోయిన ఇళ్లకు, పంటలకు నష్ట పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రజా క్షేమం కంటే ప్రభుత్వానికి ఏది ముఖ్యం కాదని, ముఖ్య మంత్రి ఆహర్నిశలు ప్రజా క్షేమానికి కృషి చేస్తున్నారని అధికారులు కష్టించి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు
 
సమీక్ష అనంతరం ఐనవిల్లి మండలం ముక్తేశ్వరం కొత్తపేట మండలం బోడిపాలెం వంతెన వద్ద ముంపుకు గురైన ప్రాంతాలని ఇంచార్జీ మంత్రి, జిల్లా మంతులు, శాసనసభ్యులు మరియు అధికారులతో కలసి పరిశీలించారు
 
ఈ సమావేశంలో రాష్ట్ర బి.సి.వెల్ఫేర్ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ, అమలాపురం ఎం.పి. శ్రీమతి చింతా అనూరాధ, కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి, ముమ్మిడివరం శాసన సభ్యులు పొన్నాడ సతీష్ కుమార్,రాజోలు శాసన సభ్యులు రాపాక వరప్రసాద్,

అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్ కౌశిక్, గైల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎన్.ఎస్.వి.బి వసంత రాయుడు, పిషరీస్ జి.డి కోటేశ్వరరావు, అమలాపురం మునిసిపల్ ప్రతిపక్ష నాయకులు చెల్లు బోయిన శ్రీనివాస్ తో బాటు ఆమలాపురం మున్సిపల్ కమీషనర్ కె.వి.వి.ఆర్.రాజు, ట్రాన్స్కో నుంచి సాల్మన్ రాజు, ఏ.డి దేవయ్య, వ్యవసాయ శాఖ ఏ.డి. షంపీ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు