రైతుల నుంచి భూములు సేకరించాలి : సీఎం జగన్

బుధవారం, 28 సెప్టెంబరు 2022 (17:00 IST)
సోలార్, విండ్ పవర్ సంస్థల కోసం రైతుల నుంచి భూములను సేకరించాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ భూములు ఇచ్చేందుకు రైతులను ప్రోత్సహించి, వారిని ఒప్పించేలా ఎమ్మెల్యేలు, ఎంపీలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
నంద్యాల జిల్లాలో  నిర్మించిన రామ్ కో సిమెంట్స్ పరిశ్రమను సీఎం జగన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోలార్, విండ్ పవర్ సంస్థల కోసం భూమిలిచ్చే రైతులకు యేడాదికి రూ.30 వేల చొప్పున లీజు ధర చెల్లిస్తామని తెలిపారు. 
 
ఈ మేరకు రైతులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపారు. ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకుని, సౌర, పవన విద్యుత్ సంస్థలకు ఇస్తుందన్నారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఐదు శాతం మేర లీజుధరను పెంచుతుందని తెలిపారు. 
 
ఒక్కో లొకేషన్‌లో కనీసం 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగేలా భూసేకరణ జరగాలని చెప్పారు. ఆ మేరకు రైతులు భూములు ఇచ్చేలా వారిని ఒప్పించేలా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని అన్నారు. ఈ గ్రీన్ గో ప్రాజెక్టుల నిర్మాణాలకు రైతులు కూడా సహకరించాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు