నామినేటెడ్ పోస్టుకు రూ.5.5 కోట్ల లంచం?

బుధవారం, 3 నవంబరు 2021 (11:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ నామినేటెడ్ పోస్టుకు రూ.5.5 కోట్లను లంచంగా ఇచ్చారు. ఈ మొత్తం ఓ జడ్పీటీసీ సభ్యురాలి నుంచి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు తీసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన ఓ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. 
 
ఐరాల జడ్పీటీసీ సభ్యురాలు వి.సుచిత్ర సీఎం జగన్‌కు రాసినట్లుగా ఉన్న ఆ లేఖలో ఇలా ఉంది... ‘నాకు జడ్పీ వైస్‌ ఛైర్మన్‌, లేకుంటే రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్‌.. అదీ కాకుంటే వైకాపా కుప్పం నియోజకవర్గ బాధ్యురాలిగా అవకాశం కల్పిస్తానని ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు రూ.5.5 కోట్లు తీసుకున్నారు. నాకు పదవి ఇప్పించకపోవడంతో నగదు చెల్లించాలని పలుమార్లు కోరాను. 
 
బెంగళూరుకు వస్తే డబ్బులు ఇస్తానని చెప్పి, అక్కడకు వెళ్లాక బెదిరించారు. మాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. తాను ఎమ్మెల్యేనని, దిక్కున్న చోట చెప్పుకోవాలని భయపెట్టారు. ఎమ్మెల్యే నుంచి మాకు ప్రాణహాని ఉంది. మీరే (సీఎం జగన్‌) స్పందించి మాకు న్యాయం చేయాలి’ అని ఆ లేఖలో ఉంది.
 
ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు మాట్లాడుతూ, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. అంతా దేవుడే చూసుకుంటారని అన్నారు. లేఖపై వివరణ కోరడానికి ప్రయత్నించగా జడ్పీటీసీ సభ్యురాలు ఎలాంటి సమాధానం చెప్పలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు