మార్పు కోసమే సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ.. సీఏం

మంగళవారం, 1 అక్టోబరు 2019 (07:07 IST)
రాష్ట్రంలో మార్పు కోసమే గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చినట్లు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఎ ప్లస్‌ కన్వెన్షన్‌ లో ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో ఉత్తీర్ణులైన వారికి నియామక పత్రాల జారీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు అభ్యర్ధులకు నియామక పత్రాలను అందచేశారు.

అంతకు ముందు వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన జాబ్‌ చార్ట్‌, మాన్యువల్‌ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో అవినీతి, వివక్షత లేని పాలనను తీసుకువద్దామని పిలుపునిచ్చారు. గ్రామాల్లో సమూల మార్పును తీసుకురావాల్సిన బాధ్యత కొత్తగా నియమితులవుతున్న ఉద్యోగులపై వుందని అన్నారు.

అలాగే ప్రతి జనవరి నెలలోనూ ప్రభుత్వంలో ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. జనవరి ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిర్వహిస్తామని అన్నారు. ఇంకా ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఏమన్నారంటే.... 

''గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన చెల్లెమ్మలు... తమ్ముళ్లకు... మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా బహుశా దేశ చరిత్రలో కూడా అత్యంత తక్కువ సమయంలో, అత్యంత పారదర్శకంగా.. ఏకంగా ఇరవై లక్షల మందికి పైచిలుకుగా ఉద్యోగాల కోసం అటెండ్‌ కావడం జరిగింది.

ఎనిమిది రోజుల పాటు ఈ పరీక్షలు జరిగాయి. అత్యంత పారదర్శకంగా పరీక్షలను నిర్వహించాం. దాదాపుగా లక్షా నలబై వేల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రావడం ఇది నిజంగా ఓ రికార్డు. దేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణాక్షరాలతో నిలిచిపోయే... ఇది ఒక చరిత్ర సృష్టించే రికార్డు. ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం పెట్టడం, తద్వారా పది నుంచి పన్నెండు ఉద్యోగాలు ఇవ్వడం అంటే... ఉజ్జాయింపుగా ప్రతి గ్రామానికి పది నుంచి పన్నెండు కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగామని సగర్వంగా చెబుతున్నాం.'' 
 
''ఇవి కాకుండా ప్రతి యాబై ఇళ్లకు ఒక వాలంటీర్‌ ఉద్యోగం ఇచ్చాం. ఇది ఉద్యోగాల చరిత్రలో ఓ సరికొత్త రికార్డుఅని చెప్పి సగర్వంగా చెబుతున్నాను. నాలుగు నెలలు తిరగక ముందే అక్షరాల నాలుగు లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఈ రికార్డు మరింత గొప్పగా... మరింత గర్వపడేలా వుండాలంటే... మీలో  ప్రతి ఒక్కరూ దీనిని ఒక ఉద్యోగంగా తీసుకోకుడదు... ఒక ఉద్యమంలా తీసుకోవాలి.

సొంత మండలంలోనే ప్రభుత్వ ఉద్యోగం చేసే భాగ్యం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. అలాంటి గొప్ప అదృష్టవంతులు మీరు అని సగర్వంగా చెప్పగలుగుతున్నాను. కాబట్టే మీ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను.

అక్కడి ప్రజల కోసం ఆలోచన చేయండి... వారి కోసం చిత్తశుద్ది, నిజాయితీగా... లంచాలు.. వివక్షత లేని పారదర్శక పాలన అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.'' 

''ప్రతి యాబై ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్లను నియమించాం. వారితో మీరందరూ అనుసంధానం కావాలని కోరుతున్నాను. వారు...మీరు కలిసి... ఇద్దరూ కలిసి ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు అనేది తీసుకురావాలని కోరుతున్నాను. మీ అందరితో ఒకే విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. 

మనం ప్రజలకు చేరువుగా వుంటూ వారికి సేవలు అందించేందుకే ఈ ఉద్యోగం చేస్తున్నామని గుర్తుంచుకోవాలి. పారదర్శకతతో, వివక్షత లేని, అవినీతి లేని పాలన కోసం గ్రామాల్లో అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ పాలన మీ భుజస్కంధాల మీద పెడుతున్నాను. మీరు తీసుకువస్తారననే నమ్మకంతో. నా పాదయాత్రలో పదమూడు జిల్లాలో పరిస్థితులను చూశాను.

గ్రామం అంటే ఎవరికైనా ప్రేమ, మక్కువ ఎక్కువే... అమెరికా...యూరప్‌ వెళ్లిన వారు కూడా సొంత ఊరిని, సొంత తల్లిని మరిచిపోరు. అక్కడి వారు కూడా తమ ఊరికి ఏదో మేలు చేయాలని ఆలోచన చేస్తూనే వుంటారు. అటువంటి బృహత్కర బాధ్యత మీ అందరి మీద వుంది.'' 

''గ్రామాల పరిస్థితిపై ఆలోచన చేయండి... కనీస సదుపాయాలు వుండాలని ఎవరైనా ఆశిస్తారు. తాగునీరు లభించాలని ఆశిస్తారు. పిల్లల చదువుల కోసం మంచి బడి వుండాలని ఆలోచిస్తారు... చిన్నా చితకా ఆనారోగ్యాలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఆలోచన చేస్తారు.

ఇవేవీ గ్రామాల్లో అందుబాటులో లేని పరిస్థితుల్లో... చివరికి బియ్యంకూడా నాసిరకంగా ఇస్తూ... అదికూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితిలో నేడు గ్రామాల్లో కనిపిస్తోంది.  రేషన్‌ కార్డు కావాలన్నా లంచం... పెన్షన్‌ కావాలన్నా లంచం... ఇల్లు లేక ... ఇంటి స్థలం కావాలన్నా.. ఎవరిని అడగాలో తెలియదు. ఎక్కడకు పోవాలో తెలియదు... ఎవరి చుట్టూ తిరగాలో తెలియదు.

మండలాఫీసుల చుట్టూ తిరుగుతూ... చివరకి ఎవరికి పడితే వారికి లంచాలు పెట్టాల్సిన పరిస్తితి వుంది. ఇటువంటి పరిస్థితిని గ్రామాల్లో చూశాం. జన్మభూమి కమిటీలపేరుతో పెన్షన్లు, రేషన్‌, పనిముట్లు... చివరికి మరుగుదొడ్లు కావాలన్నా... లంచాలు లేనిదే ఎక్కడా పని జరగని పరిస్థితిని చూశాం. గ్రామాల్లో పాలన వెంటిలేటర్‌ పై వుంది.

ఈ వ్యవస్థను బాగు చేసేందుకు సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చాం. ఎవరికి ఏది కావాలన్నా లంచాలు, వివక్ష లేకుండా డెబ్బై రెండు గంటల్లో అందుబాటులోకి తీసుకువచ్చే మెకానిజం కోసం ఈ వ్యవస్థ వుంది. యాబై ఇళ్లకే ఒక వాలంటీర్‌ ను తీసుకువచ్చాం. గ్రామాల్లో ఏకంగా గ్రామ సచివాలయాలు నెలకొల్పిన పరిస్థితులు... ఇవ్వన్నీ ఒకే ఒక్కదానికి నిదర్శనం.

ఎవరికైనా మంచి జరగాలంటే వివక్ష, అవినీతి లేకుండా డెబ్బై రెండు గంటల్లో ఇవ్వగలిగే బాధ్యత మనమీద వుంది.''
''మనం స్థాపించిన గ్రామ సచివాలయాల్లో దాదాపు ముప్పై నాలుగు డిపార్ట్‌ మెంట్లకు చెందిన  పనులు, అయిదు వందలకు పై చిలుకు సేవలు అందించే పరిస్థితి. గ్రామ వాలంటీర్‌ లు యాబై ఇళ్లకు సంబంధించిన బాధ్యత తీసుకుంటారు.

వారిలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే వారి చేయి పట్టుకుని గ్రామ సెక్రటేరియట్‌ వద్దకు తీసుకువస్తారు. వచ్చిన వారి సమస్యపై స్పందిస్తూ డెబ్బై రెండు గంటల్లో అటువంటి వారికి రేషన్‌ కార్డు, పెన్షన్‌, ఇల్లు ఏదైనా కావచ్చు... వాటిని వారికి అందిస్తే... కనీసం ఎప్పుడు చేస్తామో తెలిపే ధ్రువపత్రం వారిచేతుల్లో పెడితే... వచ్చిన వారి ముఖంలో ఎటువంటి ఆనందం కనిపిస్తుందో ఆలోచన చేయండి.'' 

 
''పెన్షన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్లు, స్థలాలు, వైద్యం, ఆరోగ్యం, విద్య, భూముల సర్వే, మార్కెటింగ్‌,  మహిళా పోలీసింగ్‌, శిశు సంక్షేమం, డెయిరీ, పశుపోషణ వంటి సేవలను అందించనున్నాం. అలాగే నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలను కూడా గ్రామ సచివాలయం పక్కనే దుకాణాలు పెట్టి, వ్యవసాయంలో ఉత్తమ విధానాల కోసం వర్క్ షాప్‌ లను కూడా పెట్టబోతున్నాం.

ఇవన్నీ మీ అందరి భుజస్కంధాలపై వున్నాయి. అక్టోబర్ రెండో తేదీ నుంచి మీరు మీ విధుల్లో చేరబోతున్నారు. ఇంత హడావుడిగా రోజుల వ్యవధిలోనే ఇటువంటి పెద్ద కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. చాలా గ్రామాల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, లామినేషన్‌ పరికరాలను రెండుమూడు రోజుల్లో అందచేసే ప్రయత్నం చేస్తాం.

డిసెంబర్‌ మొదటి వారం వరకు అన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి గ్రామ వాలంటీర్ కు ఒక స్మార్ట్ ఫోన్‌ ను నవంబర్‌ చివరి వారం నాటికి అందచేస్తాం. వీటికి సంబంధించి టెండర్లను పిలిచాం. రివర్స్‌ టెండరింగ్‌ పద్దతుల్లో మరో రెండు రోజుల్లో వాటిని ఓపెన్‌ చేస్తాం. మరో నలుబై రోజుల్లో వాటిని సప్లై చేస్తాం.

ఇవ్వన్నీ పూర్తి చేసుకుని, డిసెంబర్‌ మొదటి వారంలోగా పూర్తిగా అన్ని సదుపాయాలతో గ్రామ సచివాలయాలు వుంటాయి. ఆ తరువాత ఏదైనా చిన్నచిన్న సమస్యలు వుంటే... డిసెంబర్‌ నెలాఖరు నాటికి పరిష్కరిస్తాం. జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ఆధ్వర్యంలో అయిదు వందల సేవలు అందుబాటులోకి వస్తాయి.

జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, రేషన్‌ కార్డులు మీ ఆధీనంలోకి వస్తాయి. పూర్తి పారదర్శకంగా వాటిని ఇవ్వాలి. లబ్దిదారుల జాబితాలు పారదర్శకంగా మీ గ్రామ సచివాలయంలో డిస్‌ప్లే చేయాలి. దానివల్ల ఎవరు లబ్దిదారులు అనేది గ్రామంలో అందరికీ తెలిసిపోతుంది. దీనివల్ల సోషల్‌ ఆడిట్‌ జరుగుతుంది. సంక్షేమ పథకాలు అర్హత లేని వారికి రాకూడదు కానీ, అర్హత వుండి కూడా రాలేని పరిస్థితి ఎవరికీ వుండకూడదు.

కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు కూడా చూడవద్దని అందరికీ విజ్ఞప్తి. మనకు ఓటు వేయని వారు కూడా మనం చేసిన మంచిని చూసి వచ్చే ఎన్నికల్లో మనకు ఓటు వేసేలా మారాలి. వ్యవస్థలోకి ఇటువంటి పారదర్శకత, మార్పు తీసుకురావాలి. ఇటువంటి బాధ్యత మీ అందరిపై పెడుతున్నాను. ఎవరికైనా గ్రామాల్లో ఫలానా మంచి నాకు జరగాలి...కానీ జరగడం లేదు అని పిర్యాదు చేసే పరిస్థితి రాకూడదు.'' 

 
''ఎక్కడైనా వివక్ష, అవినీతి జరిగిందనే 1902 అనే కాల్ సెంటర్‌ నెంబర్‌ ను పెడుతున్నాం. ఏకంగా సిఎం పేషీకే ఇది కనెక్ట్ అవుతుంది. ఎక్కడా అవినీతిని ఉపేక్షించం. మీ పనితీరు బాగుంటే... రాష్ట్రం బాగుంటుంది. పరిపాలన బాగుండాలంటే... మన ఉద్యోగులు ప్రజలతో బాగుండాలి. మీ పైన గొప్ప బాధ్యతను మీ భుజస్కందాలపై పెడుతున్నాను.

దేశంలో ఎవరూ ఇటువంటి ప్రయోగం చేయలేదు. కానీ ఈ వ్యవస్థలో మార్పు తేవాలంటే ఈ ప్రయోగం చేయాలని నాకు అనిపించింది.  మీ అందరిపై నమ్మకం వుంది. అందుకే ఈ బాధ్యతను మోపాను. మీ అందరి అన్నగా... అందరికీ ఆల్‌ ద వెరీ బెస్ట్...''

''ఇరవై లక్షల మంది పైచిలుకు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పడి రాసిన ఈ పరీక్షల్లో లక్షా ముప్పై అయిదు వేల మంది పరీక్షల్లో ఉత్తీర్ణులై... ఉద్యోగాలు సాధించినందుకు కంగ్రాట్యులేషన్స్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉద్యోగాల కోసం అన్ని పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ తో పాటు అన్ని డిపార్ట్‌ మెంట్లు పట్టుదలతో పనిచేశాయి.

ఏ మాత్రం ఫిర్యాదులు లేకుండా.. ఎనిమిది రోజులు పరీక్షలు నిర్వహించడం... నిజంగా ఇంత మందికి మంచి జరిగిన పరిస్థితికి కారణమైన ఈ అధికారులను కూడా మనస్పూర్తిగా అభినందిస్తున్నా. రాష్ట్రంలోని ప్రతి కలెక్టర్‌, ఎస్పీలకు అభినందనలు. వారందరికీ సెల్యూట్‌ చేస్తున్నాను. ఈ వేదిక మీది నుంచి అందరు అధికారులను ప్రశంసిస్తున్నాను.''

 
''రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రతి ఏటా జనవరి ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. సచివాలయ ఉద్యోగాల్లో ఉత్తీర్ణులు కాలేని వారు వచ్చే జనవరిలో జరిగే నియామక ప్రక్రియకు సిద్దం కావాలని పిలుపు నిచ్చారు. అలాగే ప్రతి ఏటా కూడా ప్రభుత్వంలో ఖాళీ వున్న పోస్టులను జనవరి నెలలోనే భర్తీ చేస్తామని వెల్లడించారు.''


అనంతరం  పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం రాకముందు సాగిన బ్రిటీష్‌ పాలన తరహాలోనే ఇంకా దేశంలో పాలన జరుగుతోందని అన్నారు. నేటికీ గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు కొత్త తరహా పాలన కావాలని వైఎస్‌ జగన్‌ ఆలోచించారని అన్నారు.

దానిలో భాగంగా ప్రతి యాబై కుటుంబాలకు వాలంటీర్లు, ప్రతి రెండువేల జనాభాకు ఒక సచివాలయం కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంక్పలించారని తెలిపారు. నవరత్నాలను ప్రకటించడం, రెండు పేజీల మేనిఫేస్టోను ప్రజల ముందుకు తేవడం ద్వారా కొత్త పాలనను ప్రజలకు చూపిస్తున్నారని కొనియాడారు. ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా అమలు చేయాలనే దృఢనిశ్చయంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు.

సచివాలయ వ్యవస్థ ఏ రాష్ట్రంలోనూ లేదని, కేవలం మన ముఖ్యమంత్రి వల్లే ఇది సాధ్యపడిందని తెలిపారు. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైనవారికి ప్రభుత్వ పథకాలను అందించే ప్రయత్నం చేయాలని సూచించారు. ర్పుగోదావరిజిల్లాలో అక్టోబర్‌ రెండున సచివాలయాలను ప్రారంభిస్తున్నామని, మూడు నెలల పాలనలో నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కే దక్కుతుందని అన్నారు.

గతంలో బాబూ వస్తే... జాబు ఇస్తామని తెలుగుదేశం నేతలు చేసిన ప్రచారం ఆచరణలో విఫలమైందని విమర్శించారు. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 1.35వేల గ్రామసచివాలయ ఉద్యోగాలను భర్తీ చేశామని, ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని పిలుపునిచ్చారు.

సచివాలయ ఉద్యోగాలపై ఎల్లో మీడియా ఎన్నో అబద్దాల రాతలు రాశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఎక్కడా తప్పు జగరకుండా... పారదర్శకంగా పరీక్షలను నిర్వహించిందని అన్నారు. కేవలం మెరిట్‌ ఆధారంగానే అర్హులైన వారికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సచివాలయ ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. 

 
రాష్ట్ర పట్టణాభివృద్దిశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కొత్తగా నియమితులవుతున్న సచివాలయ ఉద్యోగులను అభినందించారు. సచివాలయ ఉద్యోగులపై ఎంతో బాద్యత వుందని అన్నారు. పాదయాత్రలో అనేకమంది తమ బాధలను వైఎస్‌ జగన్ కు చెప్పుకున్నారని, వారి కష్టాలను గట్టెక్కించాలంటే కొత్త వ్యవస్థను తీసుకురావాలని ఆనాడే శ్రీ వైఎస్‌ జగన్‌ సంకల్పించారని తెలిపారు. 

గ్రామ, వార్డు సచివాలయాలను ప్రవేశపెట్టారని, నాలుగు లక్షల పదివేల ఉద్యోగాలను కల్పించారని అన్నారు. వాటిలో సుమారు 1.35 వేల శాశ్వత ఉద్యోగాలను కల్పించారని తెలిపారు. ఎన్నికల్లో చెప్పిన నవరత్నాలనే కాకుండా... ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిరంతరం ఆలోచిస్తున్నారని అన్నారు.

ప్రజాసంక్షేమం, అభివృద్ది అనే స్వర్గీయ వైఎస్‌ఆర్‌ స్పూర్తితో... రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని కొనియాడారు. గ్రామీణ, పట్టణ వ్యవస్థను పటిష్టం చేయాలనే ఆలోచనలో భాగంగా సచివాలయ ఉద్యోగులను దీనిలో భాగస్వాములను చేశారని అన్నారు. 
 
ఈ ఉద్యోగాలను గురించి ప్రతిపక్ష నేత చంద్రబాబు గోనె సంచులను మోసే ఉద్యోగాలు అంటూ ఎద్దేవా చేయడం బాధాకరమని అన్నారు. ప్రతిపక్ష నేతగా జరుగుతున్న మార్పును కూడా చులకన భావంతో విమర్శించడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనిని కూడా ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. 

 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్‌, శ్రీ రక్షణనిధి, శ్రీ కైలా అనీల్‌ కుమార్‌, సింహాద్రి రమేష్‌,  దూలం నాగేశ్వరరావు, పంచాయతీరాజ్‌ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌, జిఎస్‌ విజయ కుమార్‌.....తదితరులు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు