గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్: జగన్
శుక్రవారం, 5 జూన్ 2020 (20:11 IST)
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం ప్రజలకు కల్పించాలని, బల్క్ ఆర్డర్లకు అనుమతులు జేసీకి అప్పగించాలని ఇసుకపై సీఎం వైయస్ జగన్ శుక్రవారం నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు అధికారులు హాజరయ్యారు.
కరోనా వైరస్ కారణంగా రీచ్‌లన్నీ మూతబడ్డాయన్న అధికారులు ఇప్పుడిప్పుడే.. మళ్లీ రీచ్‌లు ప్రారంభమవుతున్నాయని, వారం, పదిరోజుల్లో రోజుకు 3 లక్షల టన్నులు ఉత్పత్తిని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి జగన్ పలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
బల్క్ ఆర్డర్‌కు సరైన నిర్వచనం ఇవ్వండి. డిపోల్లో ఇసుకను బాగా అందుబాటులో పెట్టండి. పోర్టల్ నుంచి బల్క్ ఆర్డర్లను తొలగించండి. బల్క్ ఆర్డర్లకు అనుమతులను జేసీకి అప్పగించండి. పోర్టల్ ఆన్ చేయగానే.. నిల్వలు అయిపోతున్నాయన్న భావన పోగొట్టాలి.
ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించి బల్క్ బుకింగ్ ఉంటే... సూపరింటెండెంట్ ఇంజినీర్, జేసీల ద్వారా అనుమతులు ఇవ్వండి. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌ను చేసుకునే అవకాశం ఇవ్వాలి. డిపోల నుంచే ఇసుక సరఫరా చేయాలి, నియోజకవర్గానికి ఒకటే రేటు ఉండేలా చూడాలన్న సీఎం ఇసుక రీచ్‌ల్లో అక్రమాలు లేకుండా చూడాలని ఆదేశించారు.
బుకింగ్ టైం మధ్యాహ్నం 12 గంటలనుంచి సాయంత్రం 6 గంటలవరకూ ఉంచాలి. చిన్న చిన్న నదులనుంచి పక్కనే ఆనుకుని గ్రామాలకు ఎడ్లబళ్ల ద్వారా సొంత అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతించాలి.
కాకపోతే పంచాయతీ సెక్రటరీ నుంచి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తామని, ఎడ్ల బళ్ల ద్వారా తీసుకెళ్లి.. వేరేచోట నిల్వచేసి.. అక్రమంగా తరలిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.