ఏసీబీతో ‘సండ్ర’ దాగుడు మూతలు.. ఆంధ్రాలో ఉన్నాడా..? తెలంగాణాలోనా...?

సోమవారం, 29 జూన్ 2015 (18:33 IST)
ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకట వీరయ్య మరో కీలక ఆధారంగా మారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన ఏసీబీ పోలీసుల చేతికి చిక్కితే మరిన్ని ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. అయితే ఆయన ఏసీబీతో దాగుడుమూతలు ఆడుతున్నాడు. ఆసుపత్రిలో ఉన్నానంటూనే అడ్రస్సు చెప్పడానికి ఇష్టపడడం లేదు. విచారణకు గడవుకావాలంటూనే తాను ఎక్కడున్నాడో చెప్పడం లేదు. ఇలా సండ్ర ఏసీబీ అధికారులకు చుక్కలు చూపుతున్నారు.. 
 
తాను ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ ఇలా వ్యవహరిస్తుండడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతా... అవినీతికి నేను సింహస్వప్నం అని చెప్పుకునే చంద్రబాబు పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయిన సండ్ర బాబు సూచన మేరకే దాక్కుంటున్నారని విశ్లేషకులు, ప్రతిపక్షాల విమర్శలు వెలువుడుతున్నాయి. చెప్పడానికే నీతులు, అవి తమకు వర్తించవన్నట్లు రాజకీయ నాయకులు వ్యవహరిస్తుంటారనడానికి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వ్యవహారం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 
 
ఓటుకు నోటు వివాదంలో సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఆయన ఇంట్లో జారవిడిచింది. ఆయన ఇంటికి అంటించింది. ఇంతకంటే ఏం చేయగలుగుతుంది. దొరికితే అరెస్టు చేసి ఏసీబీ విచారిస్తుంది. సాధారణ వ్యక్తి అయితే ఈ పని ఎప్పుడో జరిగిపోయేది. కానీ ఆయనో ఎమ్మెల్యే... ఓ పార్టీ నాయకుడు. అదే సమయంలో ఆయన కూడా చట్టం పట్ల ఎంతో గౌరవంగా వ్యవహరించాలనే వాదనలు ఉన్నాయి. అయితే సండ్ర ఏం చేస్తున్నారు.? చిక్కడు దొరకడులా ఏసీబీతో దాగుడు మూతలు ఆడుతున్నాడు.
 
ఆ నోటీసుల్ని ఆయన అందుకోలేదుగానీ, నోటీసులు పంపినట్లు తెలిసింది.. అనారోగ్యంతో బాధపడ్తున్నాను.. విచారణకు హాజరు కాలేను.. ఆసుపత్రికి వస్తే తగిన సమాచారం ఇస్తాను.. అంటూ ఏసీబీకి లేఖ రాశారు. అయితే తాను ఏ ఆసుపత్రిలో ఉన్నాడో చెప్పలేదు. ఏ రాష్ట్రంలో ఉన్నాడో కూడా చెప్పలేదు. కానీ తాను అనారోగ్యంతో ఉన్నాననే విషయాన్ని మాత్రమే చెప్పి తనకు కావలసిన న్యాయపరమైన చిక్కులకు ఓ దారి ఏర్పుచుకుంటున్నాడు. 
 
అదే లేఖలో ఆయన మరోమాట కూడా వెల్లడించారు. తనకు పదిరోజుల గడువు కావాలని. ఆ గడువు ఆదివారంతో ముగిసిపోయింది. కానీ, సండ్ర నుంచి స్పందన లేదు. తాను విచారణకు అవసరమైన సమాచారం అందిస్తానంటాడు. కానీ ఎక్కడున్నాడో చెప్పడు.. తనకు ఆరోగ్యం సరిగా లేదంటాడు. కానీ ఏ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారో చెప్పారు. ఈ ఏసీబీతో దాగుడు మూతలు ఆడుతున్నారు. దీంతో ఏసీబీ తాజాగా మరోమారు సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

వెబ్దునియా పై చదవండి