కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సూపర్ సక్సెస్ అయింది. చిన్న చిన్న సమస్యలు రాకుండా చూసుకుంటే... మహిళల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో ఏపీలోనూ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఏపీలో అన్ని రకాల పాస్‌లు కలిగిన వారు 10 లక్షల మంది ఉన్నారు. ఇందులో 3-4 లక్షల మంది విద్యార్థులు, మహిళలు ఉన్నారు. వాటి ద్వారా ఆర్టీసీకి నిత్యం సగటున రూ.17 కోట్ల ఆదాయం సమకూరుతోంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే రోజుకు రూ.6 కోట్ల ఆదాయం తగ్గుతుందని అంచనా.
బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఆర్థిక సమస్యలతో పాటు పురుషులు, ఆటో డ్రైవర్ల సమస్యలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం. సాధారణ బస్సుల్లో ఉచిత ప్రయాణం, లగ్జరీ బస్సుల్లో రాయితీలు కల్పించడంపై కూడా చర్చించారు.