మరోవైపు మనబడి నాడు–నేడు కార్యక్రమంలో రెండవ, మూడవ దశ పనులు కూడా సకాలంలో చేపట్టేలా, అవసరమైన రుణాల సేకరణ ప్రక్రియ చేపట్టాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. ఇప్పుడు స్కూళ్లలో పనులు పేరెంట్ కమిటీలు చేస్తున్నాయి కాబట్టి, వాటిలో ఎలాంటి జాప్యం ఉండబోదని ఆయన పేర్కొన్నారు.
అయితే పలు చోట్ల దాతలకు అప్పగించిన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని అధికారులు ప్రస్తావించడంతో, వెంటనే ఆ బాధ్యతల నుంచి దాతలను తప్పించి, పనులను జిల్లాల కలెక్టర్లకు అప్పగించాలని సీఎం ఆదేశించారు.
వారానికి ఒకసారి వారు తమ పనులపై నివేదిక ఇవ్వాలని కోరారు. అదే విధంగా స్కూళ్లలో పనులకు సంబంధించి ఎంబీ (మెజర్‌మెంట్ బుక్)లో రికార్డింగ్ పవర్స్ కూడా సచివాలయ ఇంజనీర్లకే ఇవ్వాలని, ఆ మేరకు ఎస్‌ఓపీ రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.