ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అతి ముఖ్యమైన సీనియర్ ఐఏఎస్ అధికారిగా చెలామణి అవుతున్న సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాశ్ ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
గతంలో తాను నిర్వహించదలచిన కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారుల సమీక్షా సమావేశాలు జరుగకుండా ఆదేశాలిచ్చారని అందులో పేర్కొన్నారు. సకాలంలో చర్యలు తీసుకోవడంలో ప్రవీణ్ విఫలమయ్యారని ఎస్‌ఈసీ తెలిపారు. ఈ నెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ జరపకుండా చేశారని, జీఏడీకి అధిపతిగా ఉన్న ప్రవీణ్ తన ఆదేశాలను పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు.
అధికారులను సన్నద్ధం చేయడంలో విఫలమయ్యారని, అందుకే ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని ఎస్‌ఈసీ తెలిపారు. ఈ నెల 25న నామినేషన్ల స్వీకరణకు సహకరించలేదని అన్నారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎస్‌ఈసీ మరో లేఖ రాశారు. కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌వోసీలపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలు తొలగించాలని, ధ్రువీకరణ పత్రాల జారీలో వివక్ష, జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు.
అదేవిధంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‍పై సజ్జల చేస్తున్న విమర్శలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. సీనియర్ మంత్రులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయి రెడ్డి కూడా లక్ష్మణ రేఖ దాటారని, దీనిపై కోర్టుకు వెళ్లనున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముందుగానే తమ దృష్టికి తీసుకొస్తున్నామని గుర్తుచేశారు.