దక్షిణ భారతాన్ని కబళించే ఆపరేషన్ ద్రవిడ.. ఇదే ఆ పార్టీ ప్లాన్... వెల్లడించిన హీరో (Video)

గురువారం, 22 మార్చి 2018 (16:07 IST)
సినీ నటుడు, ప్రత్యేక హోదా ఉద్యమ నేత శివాజీ ఓ జాతీయ పార్టీపై సంచలన విషయాలను వెల్లడించారు. ఆ జాతీయ పార్టీ దక్షిణ భారతదేశాన్ని కబళించే వ్యూహంతో ముందుకుసాగుతోందన్నారు. ఇందుకోసం ఆపరేషన్ ద్రవిడను ప్రారంభించారన్నారు. ఒక్కో రాష్ట్రానికి ఉపపేర్లు కూడా పెట్టారని గుర్తుచేశారు.
 
ఆయన గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించేందుకు ఆ జాతీయ పార్టీ పెట్టిన పేరు.. అందరూ అనుకున్నట్టు ఆపరేషన్ గరుడ కాదని, అందులో గరుడ ఒక భాగం మాత్రమేనని చెప్పారు. ఆపరేషన్ ద్రవిడ, అంటే ద్రవిడ దేశం... అంటే సౌత్ ఇండియా. అదే అసలు ఆపరేషన్ అని శివాజీ వివరించారు. 
 
ఇందులో ఉపభాగాలే ఆపరేషన్ గరుడ అని, ఈ పేరు ఏపీ, తెలంగాణకు సంబంధించి ఆ జాతీయ పార్టీ పెట్టుకున్న పేరని తెలిపారు. అలాగే కర్ణాటకలో ఆపరేషన్‌ కుమార చేపట్టారని, తమిళనాడు, కేరళలో ఆపరేషన్‌ రావణ చేపట్టారని తెలిపారు. అజ్ఞాత వ్యక్తి ద్వారా 2017 సెప్టెంబర్‌లోనే ఈ విషయాలు తెలిశాయని శివాజీ అన్నారు. ఈ ఆపరేషన్‌ ఖర్చు మొత్తం రూ.4800 కోట్లు కాగా, ఇందులో కొంతమొత్తాన్ని ఇప్పటికే తరలించారని తెలిపారు. 
 
అయితే ఆపరేషన్‌ మారవచ్చు.. విధి విధానాలు మారవచ్చునని ఆయన అన్నారు. కంటెంట్‌ మాత్రం 2019 టార్గెట్‌ ఆంధ్రప్రదేశ్‌ అని శివాజీ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌కు సంధానకర్తగా ఒక రాజ్యాంగ శక్తి ఉన్నాడని, ఎవరైనా ఈ ఆపరేషన్‌లోకి రావడమే తప్ప బయటికి వెళ్లడం ఉండదన్నారు. వ్యక్తిగతంగా వివరాలు ప్రజల ముందుంచుతున్నానని శివాజీ వ్యాఖ్యానించారు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు