గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురు మృతి.. నదిలో లోతు తెలియకుండా..?

శనివారం, 3 ఏప్రియల్ 2021 (10:20 IST)
గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్‌ జిల్లాలో ఈ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెండోరా మండలం పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ వీఐపీ పుష్కర ఘాట్ గోదావరిలో స్నానం చేస్తుండగా ఏడుగురు నీటిలో గల్లంతయ్యారు. దీంతో స్థానికులు నదిలోకి దూకి గాలింపు చేపట్టారు. వీరిలో ఒకరు ప్రాణాలతో బయటపడగా.. మిగిలిన ఆరుగురు మృతిచెందారు. 
 
ప్రతి శుక్రవారం గోదావరిలో తెప్ప దీపం సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ఎల్లమ్మగుట్ట, డీకంపల్లి, మాక్లుర్‌, నిజామాబాద్‌ ప్రాంతాలకు చెందిన కుటుంబాలవారు గోదావరిలో స్నానానికి వెళ్లారు. నదిలో లోతు తెలియకుండా ఇద్దరు చిన్నపిల్లలు నీటిలోకి దిగడంతో వారు నీటిలోకి జారిపోయారు. వారిని కాపాడేందుకు మరో ఐదుగురు నదిలోకి దిగారు. 
 
అయితే వారు నదిలో కొట్టుకుపోవడంతో.. కుటుంబ సభ్యులు కేకలు వేశారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు నదిలోకి దూకి ఒకరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే మిగిలిన ఆరుగురు మాత్రం నీటిలో గల్లంతయ్యారు. ఇక, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు. 
 
మృతులను ఎల్లమ్మగుట్టకు చెందిన బొబ్బిలి శ్రీనివాస్‌ (40), అతని కుమారులు శ్రీకర్‌(14), సిద్దార్థ్‌ (16), మక్లూర్‌ మండలం గుత్ప గ్రామానికి చెందిన రాజు (24), నందిపేట్‌ మండలం డీకంపల్లికి చెందిన యోగేష్‌ (16), సురేశ్‌గా గుర్తించారు. గోదావరి నదిలో ప్రమాదవశాత్తూ జారిపడి ఆరుగురు మృతి చెందిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు 
 
అలాగే ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు