చెన్నై సెంట్రల్ - న్యూఢిల్లీ ప్రాంతాల మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఈ రైలులోని ఏసీ బీ బోగీల్లో బి-5 బోగీ వద్ద పొగలు రావడంతో నెల్లూరు జిల్లా కావలి వద్ద సుమారు 20 నిమిషాల పాటు రైలును నిలిపివేశారు. ఈ బోగీ నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు.. ఆందోళనకు గురై చైను లాగడంతో రైలు ఆగిపోయింది.
ఆ తర్వాత రైలు సిబ్బంది వచ్చి చూడగా, బ్రేక్ ఫెయిల్ కావడంతోనే పొగలు వచ్చినట్లు నిర్ధారించారు. ఇదే విషయాన్ని కావలి రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ శ్రీహరి రావు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. రైల్వే సిబ్బంది మరమ్మతుల అనంతరం రాజధాని ఎక్స్‌ప్రెస్ అక్కడి నుంచి బయల్దేరింది.