ముంబై నుంచి భువనేశ్వర్ వెళుతున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ముప్పు తప్పింది. రైలులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు అత్యవసరంగా చైన్ లాగి రైలును ఆపేశారు.
రైలులోని ఏసీ బోగీలో పొగలు రావడంతో రైలును డోర్నకల్ జంక్షన్ రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే డోర్నకల్ జంక్షన్ రైల్వేస్టేషన్‌కు చేరుకొని మరమ్మతు చర్యలు చేపట్టారు.
పొగలు వ్యాపించిన బోగీని వేరు చేసి ప్రయాణికులను మరో బోగీలోకి తరలించారు. ఈ ఘటన వల్ల ప్రయాణికులెవరూ ఇబ్బంది పడలేదని అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు.
ఏసీ బోగీలో పొగలు రావడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. సాంకేతిక కారణాల వల్ల జరిగిందా లేదా ఇతర కారణాలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకులు జామ్ అయివుండొచ్చని అధికారులు భావిస్తున్నారు.