ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ తన వార్షిక ఫైరింగ్ సాధన ప్రక్రియలో భాగంగా ఫైరింగ్ రేంజ్ ప్రాక్టీసులో పాల్గొన్నారు. చీమకుర్తిలో జిల్లా ఫైరింగ్ రేంజ్ ను సందర్శించి, తర్ఫీదు పొందుతున్న ఏఆర్ పోలీసు అధికారులు, సిబ్బందిని పలకరించారు. ఫైరింగ్ ఎలా చేయాలో ఎస్పీ పలు సూచనలు చేశారు.
జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ స్వయంగా పాల్గొని ఫైరింగ్ ప్రాక్టీస్ చేసే సిబ్బందిలో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపారు. వార్షిక ఫైరింగ్ జరగుతున్న నేపథ్యంలో ఫైరింగ్‌లో ప్రతి ఒక్కరు పాల్గొని మంచి మెళకువలు నేర్చుకొని, ఫైరింగ్ పై అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క బుల్లెట్టు టార్గెట్ (లక్ష్యం) వైపే పడే విధంగా తర్పీదు పొందాలని సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో సాయుధ దళ పోలీసుల సేవలు చాలా కీలకమని, అదేవిధంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని జిల్లా పోలీసు శాఖ ఉన్నతి కోసం ముందడుగు వేయాలని సూచించారు. కొత్తగా వచ్చిన ఆయుధాల గురించి పూర్తి స్ధాయిలో తర్ఫీదు పొంది, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించుకొని అత్యవసర సమయాలలో ప్రజల, ప్రభుత్వ, ధన,ప్రాణ రక్షణకై ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలని సూచించారు. ఫైరింగ్ లో ప్రతిభ కనబరిచిన అధికారులను సిబ్బందిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ బి.మరియాదాసు గారు, ఎ ఆర్ డిఎస్పీ కె. రాఘవేంద్రరావు, ఒంగోలు రూరల్ సిఐ ఆర్ రాంబాబు, చీమకుర్తి ఎస్సై శివ నాగేశ్వర రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.