దుర్గ‌గుడిలో ధార్మిక మండ‌లి పేరిట జ‌న‌సేన స‌మాంత‌ర వ్య‌వ‌స్థ?

గురువారం, 5 ఆగస్టు 2021 (18:24 IST)
బెజ‌వాడ క‌న‌క దుర్గ‌మ్మ స‌న్నిధిలో ఓ అనూహ్య ప‌రిణామ‌మిది. క‌న‌క దుర్గా మ‌ల్లేశ్వ‌ర దేవ‌స్థానానికి ఛైర్మ‌న్, వివిధ క‌మిటీలు ఉండ‌గా, దీనికి స‌మాంత‌రంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ధార్మిక సేవా మండ‌లి అంటూ కొత్త క‌మిటీని వేశారు. 25 మంది సభ్యులతో ధార్మిక మండలిని ఏర్పాటు చేశారు.

వీరంతా ఇంద్ర‌కీలాద్రికి స‌మూహంగా, జనసేన నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ ఆధ్వ‌ర్యంలో కొండ‌పైకి చేరారు. ఇంద్రకీలాద్రి అమ్మవారికి సారెను  సమర్పించామ‌ని జనసేన నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ చెప్పారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్  సూచనల మేరకు ధార్మిక సేవ మండలిని,  కమిటీని నిర్మించామ‌ని పోతిన మహేష్ చెపుతున్నారు. 
 
జ‌న‌సేన దుర్గ‌మ్మ ధార్మిక సేవా మండ‌లి 25 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రిపై జరిగే అవకతవకలను వెలికితీసేందుకే ఈ కమిటీ ఏర్పడింద‌ని పోతిన మ‌హేష్ చెపుతున్నారు. అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రిగా ఉన్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ కు కౌంట‌ర్ చెక్ గా ఈ క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది.

గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీలో ఎమ్మెల్యే అయిన వెల్లంప‌ల్లి... ఇపుడు వైసీపీలో చేరి దేవాదాయ శాఖ మంత్రి అయ్యారు. ఆయ‌న శాఖ‌లో జ‌రుగుతున్న అవినీతిని దుర్గ‌మ్మ సాక్షిగా బ‌ట్ట‌బ‌య‌లు చేయాల‌నే సంక‌ల్పంతో ఈ స‌మాంత‌ర క‌మిటీని ఏర్పాటు చేశార‌ని భావిస్తున్నారు.
 
అయితే, ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలు అన్నిటిలో త‌మ ధార్మిక సేవ మండలి భక్తులందరికీ ఉదారంగా  సేవలు అందిస్తుంద‌ని పోతిన మ‌హేష్ చెపుతున్నారు. అలాగే అక్ర‌మాల‌ను ఎత్తి చూపుతున్నారు. దుర్గ గుడిలో ఈశాన్య మూల ప్రసాదం పోటును ఎలా నిర్ణయిస్తారు? ఆగ్నేయంలో ఉండవలసిన ప్రసాదం పోర్టును ఈశాన్యంలో నిర్మిస్తున్నారు... ఇలాంటి అవకతవకలు అన్నిటిపై ధార్మిక కమిటీ దృష్టి పెడుతుంది...అని చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు