విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 5న రాష్ట్ర బంద్ : లెఫ్ట్ పిలుపు

ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (09:39 IST)
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌  ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తిప్పికొట్టేందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక మార్చి 5న  బంద్‌కు ఇచ్చిన పిలుపును బలపరుస్తున్నట్లు వామపక్ష పార్టీలు తెలిపాయి. బంద్‌ను జయప్రదం చేయాలని అన్ని తరగతుల ప్రజానీకాన్ని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 
 
ఆనాడు 32 మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌కు అమ్మడానికి పూనుకోవడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు అమలు విషయంలో మోసం చేసిన బీజేపీ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో ప్రజలకు మరోసారి ద్రోహం చేస్తోందని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును మళ్లీ అదే స్ఫూర్తితో నిలబెట్టుకోవడమే మార్గమన్నారు. 
 
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మార్చి 5న బంద్‌కు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపునిచ్చిందని తెలిపారు. కాగా, మార్చి 5న బంద్‌కు అన్నివర్గాల మద్దతు కూడగట్టే పనిలో ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ నిమగ్నమైంది. 
 
శనివారం విశాఖలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబులతోపాటు పలువురు నాయకులను కమిటీ ప్రతినిధులు కలిసి బంద్‌కు సహకరించాలని కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు