రాష్ట్రప్రభుత్వం ప్రజారోగ్యాన్ని కాపాడటంలో దారుణాతిదారుణంగా విఫలమైందని, ప్రతిపక్షాలను, ప్రశ్నించేవారిని నిర్వీర్యం చేయడం పై, ప్రజలపై పన్నులభారం మోపడంపై పెట్టినశ్రద్ధను ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై పెట్టలేదని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి , శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఎద్దేవాచేశారు.
ఆయన తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ప్రజలప్రాణాలు ఒకపక్కన గాల్లో కలిసిపోతున్నా ప్రభుత్వం ఇప్పటివరకు ఏలూరువింతవ్యాధి కారణాలను గుర్తించలేకపోవడం బాధాకరమన్నారు. ఏలూరు వింతవ్యాధిపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని రామానాయుడు స్పష్టంచేశారు.
ఈ నెల 5వతేదీనీ 150మంది వరకు ఆసుపత్రుల్లో చేరాక, ఆరోతేదీన టీడీపీనేత లోకేశ్ ఏలూరులో పర్యటించాకే ముఖ్యమంత్రిలో స్పందన వచ్చిందన్నారు. అదికూడా 7వతేదీన పెళ్లికివెళ్తూ ముఖ్యమంత్రి మొక్కుబడిగా వింతవ్యాధి బాధితులను పరామర్శించారన్నారు. ఆనాటినుంచి ఇప్పటివరకు ఈప్రభుత్వంగానీ, ముఖ్యమంత్రిగానీ బాధితులకు ఒకభరోసా కల్పించలేకపోయారని నిమ్మల ఆక్షేపించారు.
ఏలూరులోని పంపులచెరువులోని నీటిని తాగి, 20, 30 మంది బాధితులు ఆసుపత్రుల్లో చేరినా, ప్రభుత్వం ముందుగానే సమస్యను ఎందుకుగుర్తించలేకపోయిందన్నారు. ఏలూరు సమస్యపై ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్న తీరుచూస్తుం టే వింతవ్యాధి ప్రజలకు వచ్చిందా...లేక వారికి వచ్చిందా అనే సందేహం అందరికీ కలుగుతోందని దెప్పిపొడిచారు.
మంత్రులు చెప్పిన మాస్ హిస్టీరియా ముఖ్యమంత్రికి, వారికే వచ్చినట్లుగా రాష్ట్రప్రజలు భావిస్తున్నారన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్ అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం, చివరకు 7వేలమందిని బలి తీసుకుందన్నారు.
ఏలూరు వింతవ్యాధికి గురైన బాధితులంద రికీ వారికున్న సమస్యలదృష్ట్యా యూరాలజిస్టులతో వైద్యం చేయించాలని, అలాకాకుండా ప్రభుత్వం జనరల్ ఫిజీషియన్లతోనే వారికి చికిత్స చేయించిందని నిమ్మల తెలిపారు. కొందరిని విజయవాడ గుంటూరుకు తరలించారని, అక్కడున్న సౌకర్యాలను ప్రభుత్వం ఏలూరుఆసుపత్రిలో ఎందుకుకల్పించలేకపోయిందన్నారు.
ప్రత్యేక బృందాలు, హెల్ప్ లైన్, కంట్రోల్ రూమ్ వంటివాటిని ఏర్పాటుచేయడం గానీ, శానిటైజేషన్ చర్యలు చేపట్టడంలో గానీ, యుద్ధప్రాతిపదికన రక్తనమూనాలు సేకరించడంగానీ ప్రభుత్వం చేయలేపోయిదన్నారు. పంపులచెరువు నీరు కలుషితమైనా, తాగునీరు సరఫరా అయ్యే కృష్ణాకాలువలో కోవిడ్ వ్యర్థాలు కలిసినా ప్రభుత్వం, ఆదిశగా ఎటువంటిచర్యలు చేపట్టలేదని నిమ్మల మండిపడ్డారు.
ఐఐసీటీ, ఎయిమ్స్ వంటిసంస్థలుచేసిన పరీక్షలను ప్రభుత్వం ఎందుకు బహిర్గతంచేయడం లేదన్నారు. ఈనాటికీ కూడా ఏలూరు సమస్యకు గలకారణాలను ప్రభుత్వం గుర్తించలేక పోయిందని, మొబైల్ మినరల్ వాటర్ కేంద్రాలు ఏర్పాటుచేసి, అక్కడి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించలేకపోయిందన్నారు.
గోదావరిలో మునిగిన పడవను బయటకు తీయడానికే ఈ ప్రభుత్వానికి 50రోజులుపట్టిందని, అటువంటి ప్రభుత్వం మా ఆరోగ్యాన్ని కాపాడుతుందా అని ఏలూరువాసులు వాపోతున్నా రని నిమ్మల తెలిపారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలని రాజ్యాంగమే చెబుతోందని, అదివారిహక్కు అని కూడా ఈ ప్రభుత్వం గుర్తించ లేకపోయిందన్నారు.
రాష్ట్రంలోని ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలన్న సదుద్దేశంతో టీడీపీ ప్రభుత్వం రూ.23వేలకోట్లతో చేపట్టిన జలధార, స్వచ్ఛధార, ఎన్టీఆర్ సుజలస్రవంతి ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిలిపేసిందన్నారు. జలవనరులు, సురక్షిత తాగునీరు అందించడానికి జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కరూపాయి కూడా ఖర్చుచేయలేదన్నారు.
ఏలూరులో మొదలైన వింతవ్యాధి రాష్ట్రమంతా ప్రబలకముందే ప్రభుత్వం మేల్కోవాలని, అన్నిప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి ఉపయోగించే చెరువులను, రిజర్వాయర్లను, ఫిల్టర్ బెడ్లను తక్షణమే శుభ్రపరచాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏలూరులో జరిగిన సంఘటన రాష్ట్రంలో ఎక్కడా రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని, పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని రామానాయుడు డిమాండ్ చేశారు.
వైద్యఆరోగ్యశాఖ, మున్సిపల్ శాఖ, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అప్పుడే ప్రజల ఆరోగ్యం కాపాడటం ప్రభుత్వంవల్ల అవుతుందని నిమ్మల స్పష్టంచేశారు. టీడీపీ ప్రభుత్వం తాగునీటికోసం ప్రారంభించిన ప్రాజెక్టులను తక్షణమే ప్రారంభించాలన్నారు. ఏలూరు వింతవ్యాధికారణంగా సంభవించిన మరణాలను ప్రభుత్వ మరణాలుగానే పరిగణించాలని రామానాయడు తేల్చిచెప్పారు.