ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు... విజ‌య‌వాడ‌, విశాఖ‌లో 45 డిగ్రీల సెల్షియ‌స్...

గురువారం, 26 మే 2016 (21:28 IST)
విజ‌య‌వాడ‌: ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలు వీస్తున్న నేపథ్యంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు నిన్న విశాఖ పెందుర్తిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం వరకు చల్లటి గాలులతో ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించిన నగర ప్రజలు ఒక్కసారిగా వేడి, ఉక్కబోత బారిన పడ్డారు. జనం రహదారులపైకి రావడానికే భయపడుతున్నారు. 
 
మరో రెండు వారాల వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని నిపుణుల అంచనా. ఈరోను తుపాను విశాఖ తీరం నుంచి కళింగపట్నంలో ప్రవేశించడమే తడవుగా వాతావరణం మారిపోయింది. పశ్చిమ దిశగా ప్రస్తుతం నగరంపైకి వేడి గాలుల వస్తున్న కారణంగానే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సముద్రం మీదుగా వచ్చే చల్లని గాలులు నిలిచిపోవడంతో ఉక్కబోత కూడా తీవ్రమవుతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని తీర ప్రాంతాల్లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది.
 
విశాఖ జిల్లాలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నైరుతి రుతు పవనాలు కేరళలో ప్రవేశించి రాయలసీమకు వచ్చేలోగా కోస్తాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. అందువల్ల రాయలసీమలో రుతు పవనాలు ప్రవేశించాక ప్రత్యేకించి కోస్తా వెంబడి తీవ్రమైన వేడి ఉంటుంది. మహా నగరంలో ఈ ప్రభావం మరింత ఎక్కువ. పగటి ఉష్ణోగ్రతలు 43 నుంచి 46 డిగ్రీల సెల్సియస్‌ మధ్య చేరుకునే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది గరిష్ఠంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజ‌య‌వాడ, విశాఖ‌ల్లో 45 డిగ్రీలు న‌మోద‌య్యాయి. రుతు పవనాలు మన తీరానికి చేరే వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్లీ ఒడిశాకు విస్తరించే సమయంలో గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ నిపుణుల అంచనా.

వెబ్దునియా పై చదవండి