ఉల్లి పంటకు మద్దతు ధర కల్పించాలి: సిపిఐ

శనివారం, 8 ఆగస్టు 2020 (20:13 IST)
ఉల్లి పంటకు మద్దతు ధర కల్పించి, పంట కొనుగోలుకు సత్వర చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి శనివారం లేఖ రాశారు.

సిపిఐ చేపట్టిన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా గురు, శుక్రవారాల్లో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించామని, ఈ సందర్భంగా ఉల్లి రైతుల కష్టాలను కళ్లారా చూశామని పేర్కొన్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్లో దిగుబడయిన ఉల్లి పంట కొనుగోలు లేకపోవడంతో ఉల్లి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని తెలిపారు.

ఎకరాకు దాదాపు రు.70-80వేల వరకు ఖర్చు పెట్టి ఉల్లి పంట వేసిన రైతుకు కన్నీరే మిగిలిందని పేర్కొన్నారు. ఉల్లి అమ్మకాలకు ప్రధాన కేంద్రమైన కర్నూలు మార్కెట్‌ యార్డు కరోనా విపత్తు కారణంగా మూసివేయడంతో రైతులు దిక్కుతోచక లబోదిబోమంటున్నారని తెలిపారు.

ఈ ఖరీఫ్‌లో దాదాపు 40వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేయగా, 33,75,000 క్వింటాళ్ల ఉల్లి దిగుబడి వచ్చిందని, గిట్టుబాటు ధరల్లేక రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. పంటను గ్రామ సచివాలయాల్లో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో జరగడం లేదని తెలిపారు.

ఉల్లి కొనుగోలుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి, ఉల్లి పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు