ఇంటర్ ఆత్మహత్యలపై సుప్రీంలో వ్యాజ్యం

గురువారం, 22 ఆగస్టు 2019 (14:54 IST)
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్ర బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. సంఘం తరపున సీనియర్‌ న్యాయవాది నిరూ‌పారెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. 
 
ఆత్మహత్య చేసుకున్న ప్రతి విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలనీ, ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలనీ, సాంకేతిక సంస్థ గ్లోబరీనాపై విచారణ చేపట్టాలని కోరినట్లు అచ్యుతరావు చెప్పారు. అవకతవకలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరినట్లు ఆయన తెలిపారు. 
 
ఇంటర్‌ ఫలితాల వెల్లడిలో జరిగిన తప్పులతో ఫెయిలైన 25 మంది విద్యార్థులు మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
 
ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారితీసింది. విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహించాయి. విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి కోవింద్‌కు ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై స్పందించిన రాష్ట్రపతి... ఆత్మహత్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖను ఆదేశించడం, కేంద్రం... సీఎస్‌.ఎస్‌కే జోషికి లేఖ రాయడం తెలిసిందే. ఓవైపు రాష్ట్రపతి స్పందించడం, మరోవైపు సుప్రీంకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించడంతో ఇంటర్‌ ఫలితాల వివాదం మళ్లీ తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు