64 పిల్‌లు వేసిన వ్యక్తి... ధిక్కారానికి శిక్ష త‌ప్ప‌ద‌న్న సుప్రీం కోర్టు

గురువారం, 30 సెప్టెంబరు 2021 (17:02 IST)
న్యాయ స్థానాల ప్రతిష్ఠను కాపాడడానికే వాటికి ‘కోర్టు ధిక్కరణలకు శిక్షించే’ అధికారాన్ని రాజ్యాంగం కట్టబెట్టిందని బుధవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇదేమీ కక్ష తీర్చుకోవడానికి ఉద్దేశించింది కాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో న్యాయస్థానాలకు ఉన్న అధికారాలను ఎవరూ తీసుకోలేరని తెలిపింది. చట్టసభల్లో శాసనాలు ద్వారా కూడా దీన్ని హరించలేరని స్పష్టం చేసింది. కోర్టుపై బురద జల్లడంతో పాటు బెదిరించినందుకు విధించిన రూ.25 లక్షల జరిమానాను చెల్లించని సూరజ్‌ ఇండియా ట్రస్టు ఛైర్మన్‌ రాజీవ్‌ దైయాను ఉద్దేశించి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
 
 ‘‘ఎవరో ఒకరు తగని వ్యాఖ్యలు చేసినంత మాత్రాన జడ్జి ప్రతిష్ఠ ఏమీ తగ్గిపోదు. కానీ తన ఉనికిని నిరూపించుకోవడానికి అందరిపై విమర్శలు చేస్తూ నిరంతరం వ్యాజ్యాలు వేస్తూ పోతుంటే కోర్టు జోక్యం చేసుకోవాల్సిందే’’నని తెలిపింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారిని శిక్షించడం రాజ్యాంగం కల్పించిన అధికారం అని తెలిపింది. విధించిన శిక్షను వినడానికి వచ్చే నెల ఏడో తేదీన కోర్టుకు హాజరు కావాలని రాజీవ్‌ను ఆదేశించింది. ఏడాదిలో 64 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి కోర్టును దూషించినందుకు 2017లో ఆయనకు న్యాయస్థానం రూ.25 లక్షల జరిమానా విధించింది.  జరిమానా కట్టడానికి తన వద్ద సొమ్ము లేదని, క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతిని కోరుతానని రాజీవ్‌ చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు